అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆగిపోలేదు
టాలీవుడ్ లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. 'జులాయి' మూవీతో వీరి కాంబినేషన్ మొదలవగా.. ఆ తర్వాత 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అలా వైకుంటపురంలో'.. ఈ మూడు సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ముఖ్యంగా 'అలా వైకుంఠపురంలో' ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా హ్యాట్రిక్ హిట్ తర్వాత మళ్లీ నాలుగో సారి వీరి కాంబినేషన్ కుదిరింది. ఇదే విషయాన్ని మేకర్స్ కొన్ని నెలల క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఇటీవల మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' విషయంలో త్రివిక్రమ్ డైరెక్షన్ పై తీవ్ర విమర్శలు రావడంతో నెక్స్ట్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు సోమవారం బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ టీం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది.
ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ
అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ వేదికగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రొడక్షన్ నెంబర్ 8 పేరుతో మేరకు అల్లు అర్జున్ పోస్టర్ రిలీజ్ చేస్తూ బన్నీకి బర్త్డే విషెస్ తెలిపారు." అన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ పై ఏదైనా సాధించాలని గొప్ప పట్టుదల అంకితభావం ఉన్న అద్భుతమైన నటుడు భారతీయ సినిమా స్టైలిష్ ఐకాన్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత మా అల్లు అర్జున్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీతో మళ్ళీ పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా సార్" అంటూ పేర్కొన్నారు. ఈ పోస్టుతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ ప్రాజెక్టు 'పుష్ప2' తర్వాత సెట్స్ పైకి వెళ్తుందా? లేక మరింత ఆలస్యంగా పట్టాలెక్కుతుందా? అనేది చూడాలి.
300 కోట్ల బడ్జెట్ తో
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు గీతా ఆర్ట్స్ సంస్థ కలిసి నిర్మిస్తోంది. 'పుష్ప' తర్వాత బన్నీకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోవడంతో నిర్మాతలు ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడడం లేదు. పాన్ ఇండియా స్థాయిలోనే ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
Also Read : పుష్పరాజ్ మాస్ జాతర షురూ... 'పుష్ప 2' టీజర్ వచ్చేసిందోచ్