Bollywood Actor Govinda Says Industry Conspired Against Him: బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (Govinda) కొంతకాలంగా ఎలాంటి సినిమాలు చేయకుండా సైలెంట్‌గా ఉన్నారు. దీనిపై తాజాగా ముఖేష్ కన్నా (Mukesh Khanna) యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో తనపై కుట్ర జరిగిందని.. తనను బయటకు పంపించేందుకు కొందరు ప్రయత్నించారని వెల్లడించారు. కేవలం తన నటనల వల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నట్లు తెలిపారు.

'ఇంటి బయట గన్స్‌తో ఉన్నారు'

'బాలీవుడ్ ఇండస్ట్రీలో నన్ను బయటకు గెంటేయాలని కొంతమంది చూశారు. అది ఓ ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగింది. వారు నన్ను పరిశ్రమ నుంచి తొలగించాలని కోరుకున్నారు. వారంతా బాగా చదువుకున్న వారు. నేను అంతగా చదువుకోలేదు. వారి ప్లేస్‌లోకి నేను వచ్చానని నాకు అర్థమైంది. కాబట్టి వారు నాతో ఆటలు ఆడడం ప్రారంభించారు. కేవలం నా నటన వల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. నన్ను టార్గెట్ చేసిన వారి పేర్లను చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఆ పరిశ్రమలో పనిచేశాను. నా ఇంటి బయట గన్స్ పట్టుకున్న వ్యక్తులను నేను గుర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి.' అంటూ గోవిందా షాకింగ్ కామెంట్స్ చేశారు. 

Also Read: ట్రెండింగ్‌లో #SSMB29 - లీకులపై స్పందించిన జక్కన్న టీం.. నెక్స్ట్ ఆ లొకేషన్లలో భారీ భద్రత మధ్య షూటింగ్

'నన్ను నేను చెంపదెబ్బ కొట్టుకునేవాడిని' 

ఇదే సందర్భంలో తన కెరీర్ గురించి గోవిందా ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు. తాను కనెక్ట్ కాలేనని భావించి రూ.100 కోట్ల ప్రాజెక్టులను రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. అలా చేసినందుకు కొన్నిసార్లు అద్దంలో తనను తాను చూసుకుని చెంపదెబ్బలు కొట్టుకునేవాడినని అన్నారు. 'నీకు పిచ్చి పట్టింది.. ఆ డబ్బుతో నువ్వు ఆర్థిక సహాయం చేసుకోగలిగేవాడివి' అని తనకు తానే చెప్పుకునేవాడనని పేర్కొన్నారు. ఆ సినిమాల్లో రోల్స్ మంచి పేరు సంపాదించాయని అన్నారు. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన గోవిందా ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్నారు. 2019లో చివరిసారిగా రంగీలా రాజాలో కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది.

విడాకుల రూమర్స్‌పై..

మరోవైపు, గత కొద్దికాలంగా గోవిందా తన భార్య సునీతా అహుజాతో విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్ హల్చల్ చేశాయి. వీరిద్దరూ కొన్ని రోజుల నుంచి వేర్వేరుగా ఉంటున్నారని ఆంగ్ల మీడియాలో కథనాలు సైతం వచ్చాయి. దీనిపై స్పందించిన గోవిందా.. ఆ వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. సునీతా అహుజా సైతం ఈ వార్తలపై స్పందించారు. గోవిందాను, తనను ఎవరూ విడదీయలేరని తేల్చిచెప్పారు. 'గోవిందా రాజకీయాల్లోకి ఉండడం వల్లే ఆయన్ని కలిసేందుకు మా ఇంటికి ఎంతో మంది వ్యక్తులు వస్తుండేవారు. దాని వల్ల కుమార్తెకు కాస్త ఇబ్బంది ఉండేది. ఇల్లంతా కలియతిరగడం నాకు, నా కుమార్తెకు చాలా ఇష్టం. వేరే వాళ్లు ఇంటికి వస్తుండడంతో మాకు నచ్చినట్లుగా మేము ఉండలేకపోతున్నాం. మా ఇంటికి దగ్గర్లోనే మరో ఇల్లు తీసుకుంటే బాగుంటుందని భావించి అలానే చేశాం. అందుకే గోవిందా ఒకచోట.. నేను, నా కుమార్తె మరోచోట ఉంటున్నాం. అంతమాత్రాన మేం విడిపోయినట్లు కాదు. మమ్మల్ని విడదీసే ధైర్యం ఎవరికైనా ఉందా.?' అంటూ సునీతా నిలదీశారు.

Also Read: తెలుగులో మరో ఓటీటీలోకి మర్డర్ మిస్టరీ 'రేఖాచిత్రం' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా..?