Telangana State Anti Narcotic Bureau: సినిమాలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్ సినిమాకు కూడా అలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. ప్రస్తుతం ఈ మెగా హీరో.. దర్శకుడు సంపత్ నందితో కలిసి ‘గాంజా శంకర్’ అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు నెలల క్రితం రిలీజ్ అయిన ఈ టైటిల్ గురించి ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. టైటిల్ మార్చాలి అంటూ మూవీ టీమ్‌కు నోటీసులు వచ్చాయి. ఈ నోటీసులపై మూవీ టీమ్ ఎలాంటి స్పందన ఇస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
గొప్పగా చెప్తున్నట్టు ఉంది..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాంటీ నార్కొటిక్ బ్యూరో.. ‘గాంజా శంకర్’ మూవీ టీమ్‌కు నోటీసులు పంపింది. టైటిల్‌లో గాంజాలాంటి మత్తు పదార్థం పేరును ఉపయోగించడమే వీనికి కారణమని తెలుస్తోంది. ‘యూట్యూబ్‌లో గాంజా శంకర్ - ఫస్ట్ హై పేరుతో ఒక వీడియో అప్లోడ్ అయ్యింది. ఆ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇందులో హీరో గంజాయి పండించే బిజినెస్ చేస్తున్నాడని అర్థమవుతుంది’ అంటూ ముందుగా ఈ నోటీసులో పేర్కొన్నారు. ఆ తర్వాత గాంజాయి లాంటి వాటిని పండించడం చట్టరీత్యా నేరం అని మరోసారి ఈ నోటీసుల ద్వారా గుర్తుచేశారు. అలాంటి నేరాలకు పాల్పడిన వారికి శిక్షలు ఏంటో కూడా ఇందులో పేర్కొన్నారు. దీంతో ‘గాంజా శంకర్’ అనే సినిమాలో హీరో అలాంటి నేరాలకు పాల్పడడమే కాకుండా.. టైటిల్‌లోనే దాని గురించి గొప్పగా చెప్తున్నట్టు ఉందని తెలిపారు.
పిల్లలపై ప్రభావం..
‘ఇలాంటి సీన్స్‌ను మామూలుగా చూపించడం వల్ల యువతలో నార్కొటిక్స్ గురించి గొప్పగా చూపించినట్టుగా ఉంటుంది. అంతే కాకుండా వాటిని ఉపయోగించడానికి ప్రేరేపిస్తున్నట్టుగా ఉంటుంది. ఇది చూస్తున్న ప్రేక్షకులపై, సమాజానిపై ఎంతోకొంత ప్రభావం చూపిస్తుంది. వారిని డ్రగ్స్ ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది. ‘గాంజా శంకర్’ వల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చట్టపరంగా మూవీ మేకర్స్‌కు సమస్యలు ఎదురవ్వడం ఖాయం. సినిమా అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో కీలకంగా మారింది కాబట్టి పిల్లలపై, ఇంకా పూర్తిగా మానసికంగా బలపడని వ్యక్తులపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మోషన్ పిక్చర్ అనేది చూడడానికి, వినడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఇది ఆడియన్స్‌పై వెంటనే ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’ అని నోటీసుల్లో ఉంది.
చర్యలు తప్పవు..
‘గాంజా శంకర్‌లో గంజాయి, డ్రగ్స్‌ను ఉపయోగించడం గురించి గొప్పగా చూపించరని ఆశిస్తున్నాం. యూత్‌పై ప్రభావం చూపించే సీన్స్ ఉండవని భావిస్తున్నాం. అందుకే గాంజా శంకర్ అనే టైటిల్ నుండి గాంజాను తొలగించాలని ఆదేశిస్తున్నాం. అంతే కాకుండా సినిమాలో గంజాయి, నార్కొటిక్స్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉంటే 1985 ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవు’ అంటూ యాంటీ నార్కొటిక్ బ్యూరో నోటీసులలో స్పష్టం చేసింది. ఈ నోటీసులను హీరోగా నటించిన సాయి ధరమ్ తేజ్‌తో పాటు నిర్మాత అయిన నాగవంశీకి, దర్శకుడు అయిన సంపద్ నందికి కూడా పంపించింది. ‘గాంజా శంకర్’ టీమ్.. ఈ విషయంపై స్పందించాల్సి ఉంది.