Game Changer Song Update: ఫైనల్‌గా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ వచ్చేసింది. ఇందులో నుంచి ‘జరగండి’ పాట విడుదలకు సిద్ధమయ్యిందని మేకర్స్.. ఓ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ చేతిలో పట్టుకున్న పుస్తకం చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. అది ప్రముఖ రచయిత చలం రాసిన ‘ప్రేమ లేఖలు’ పుస్తకం. ఆ పుస్తకానికి, పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌కు సంబంధం లేదు. అయితే ఇది ఒక లవ్ సాంగ్ అని చెప్పడానికి పోస్టర్‌లో ఆ పుస్తకాన్ని చూపించి ఉండవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈరోజుల్లో యూత్‌కు ఈ పుస్తకం గురించి పెద్దగా తెలియకపోయినా ఒకప్పుడు ప్రేమకథల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘ప్రేమ లేఖలు’.
పుస్తకానికి ఏంటి సంబంధం..
ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరితో మాట్లాడాలన్నా ఒక కాల్ చేస్తే చాలు.. అది కూడా అవసరం లేదు అనుకుంటే ఒక్క మెసేజ్ పెడితే చాలు.. కానీ ఒకప్పుడు ప్రేమించిన వారితో మాట్లాడడానికి ప్రేమలేఖలు మాత్రమే మాధ్యమంగా ఉండేవి. అలాంటి ప్రేమలేఖల ప్రాముఖ్యతను తెలియజేసిన పుస్తకమే చలం రాసిన ‘ప్రేమ లేఖలు’. 1986లో విడుదలయిన ఈ పుస్తకం.. ప్రేమలేఖల గొప్పదనాన్ని సూటిగా నిర్మొహమాటంగా ప్రేమను వ్యక్తం చేసే విధానాన్ని వివరిస్తుంది. ఇక అప్పటి పుస్తకం ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ నుంచి విడుదలయిన రామ్ చరణ్ పోస్టర్‌లో ఉండడమేంటని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
ఆ లుక్‌తో లింక్..
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యి చాలాకాలం అయ్యింది. అయితే ఈ షూటింగ్ ప్రారంభమయిన మొదట్లో లొకేషన్ నుంచి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. దాన్ని బట్టి చూస్తే హీరో ఇందులో డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే లీక్ అయిన ఫోటోల్లో రామ్ చరణ్ వింటేజ్ లుక్స్‌లో కనిపించాడు. తాజాగా విడుదలయిన ‘జరగండి’ పాట పోస్టర్‌లో ‘ప్రేమ లేఖలు’ లాంటి పుస్తకాన్ని పట్టుకొని కనిపించాడు. అంటే ఇది వింటేజ్ రామ్ చరణ్‌కు సంబంధించిన పాట అయ్యిండొచ్చా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ రామ్ చరణ్ లుక్ చూస్తే అలా లేదని మరికొందరు ఈ అంచనాలను కొట్టిపారేస్తున్నారు.
సిద్ధంగా ఉండండి..
‘జరగండి’ పాట పోస్టర్ మొత్తం కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఇందులో రామ్ చరణ్ లుక్ చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా ఉంది. మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాట విడుదలకు సిద్ధమయ్యింది. ఉదయం 9 గంటలకు ‘గేమ్ ఛేంజర్’ నుంచి మొదటి పాట విడుదల అవుతుందని సినిమాను నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘డ్యాన్స్ షూస్ వేసుకొని సిద్ధంగా ఉండండి’ అంటూ ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చింది. ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ నటించింది. శ్రీకాంత్, సునీల్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఫైనల్‌గా ఈ సినిమాకు తమన్ ఎలాంటి సంగీతం అందించాడో కొన్ని గంటల్లో ప్రేక్షకులు తెలుసుకోనున్నారు.
Also Read: అటు సినిమాలు, ఇటు వివాదాలు - ప్రకాష్ రాజ్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?