పిల్లలను పెంచి పెద్ద చేసి, ఈ సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు పాత్ర ఎంతైనా ఉంది. మనల్ని తన కడుపులో నవమాసాలు మోసేది తల్లి అయితే.. జీవితాంతం తన గుండెలపై పెట్టుకుని చూసుకునేది తండ్రి. కొడుకి మొదటి హీరో, కూతురుకి మొదటి ప్రేమ ఎవరంటే అది నాన్నే అని చెప్పాలి. 'నాన్న' అనే పిలుపులో ఉండేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు.. అంతకుమించిన ఎమోషన్. పిల్లల జీవితాన్ని గెలిపించేందుకు, అలుపెరగకుండా శ్రమించే నిస్వార్థ శ్రామికులైన తండ్రులను గౌరవించడం కోసం ప్రతి ఏడాది జూన్ మూడవ ఆదివారం 'ఫాదర్స్ డే' సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి ప్రత్యేకమైన రోజును పురస్కరించుకొని, తెలుగులో ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.


నాన్నకు ప్రేమతో..


ఫాదర్ సెంటిమెంట్ అనగానే ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో మొదటగా గుర్తొచ్చేది 'నాన్నకు ప్రేమతో'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తండ్రీ కొడుకుల ప్రేమను ఆధారంగా చేసుకునే కథతో రూపొందింది. తండ్రి చివరి రోజుల్లో ఆయన్ని మోసం చేసిన వ్యక్తి మీద తనయుడు ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు.. ఆయన సంతోషంగా కన్ను మూయడానికి ఏం చేసాడు అనేది ఈ చిత్రంలో చూపించారు. క్లైమాక్స్ లో తండ్రి బెడ్ పై ఉన్నప్పుడు వచ్చే సీన్లు కన్నీళ్లు పెట్టిస్తాయి. ఇందులోని నాన్నకు ప్రేమతో పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.


కొత్త బంగారు లోకం


దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన 'కొత్త బంగారు లోకం', 'బొమ్మరిల్లు' చిత్రాలు కూడా తండ్రి సెంటిమెంట్ ను తెర మీద ఆవిష్కరించాయి. యుక్త వయసు వచ్చిన కొడుకుకి ఒక తండ్రి ఎలాంటి సపోర్ట్ అందిస్తాడు, ఆయన మరణించిన తర్వాత తండ్రి విలువ తెలుసుకున్న కొడుకు ఎలా ప్రయోజకుడు అయ్యాడు అనేది 'కొత్త బంగారు లోకం' సినిమాలో చూపించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించగా ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రను పోషించారు. ఇందులో వీరిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయి.


బొమ్మరిల్లు


సిద్ధార్థ్ హీరోగా భాస్కర్ తెరకెక్కించిన సినిమా 'బొమ్మరిల్లు'. కుటుంబానికి యజమానిగా, ఇంటికి పెద్దదిక్కుగా వ్యవహరించే తండ్రి.. మితిమీరిన ప్రేమ బాధ్యతలతో, పెళ్లీడుకు వచ్చినా కొడుకు చేయి వదలకపోతే.. అతను ఏం కోల్పోయాడు? అనే కథతో ఈ సినిమా రూపొందింది. తండ్రి ఆలోచనలన్నీ నిరంతరం పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే పరితపిస్తూ ఉంటాయని, అదే సమయంలో కొడుకు తన వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోతాడనే విషయాన్ని ఎంతో చక్కగా ఈ సినిమాలో చూపించారు. ఇప్పటికీ బొమ్మరిల్లు ఫాదర్, బొమ్మరిల్లు భాస్కర్, బొమ్మరిల్లు సిద్ధార్థ్ అని పిలుస్తున్నారంటే.. ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


ఆడవారి మాటలకు అర్థాలు వేరులే


విక్టరీ వెంకటేష్ నటించిన 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాలోనూ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. నాన్న కఠినంగా మాట్లాడినా, ఒక దెబ్బకొట్టి శిక్షించినా.. తండ్రి గుండెల నిండా కొడుకుపై ప్రేమ ఉంటుంది. అతను ప్రయోజకుడైతే చూసి ఆనందంతో పొంగిపోతాడు.. పది మందికి చెబుతూ మురిసిపోతాడు. చివరికి తనయుడి ప్రేమ విషయంలోనూ మద్దతుగా నిలుస్తాడనేది ఈ సినిమాలో చూపించారు. ఇందులో కోట శ్రీనివాసరావు, వెంకటేష్ తండ్రీకొడుకులుగా చాలా అద్భుతంగా నటించారు. సెల్వ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకుడు. 


శివకార్తికేయన్ ‘డాన్’


శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన కాలేజ్ డాన్' సినిమాలోనూ తండ్రి సెంటిమెంట్ ను చాలా బాగా చూపించారు. కొడుకు విజయమే తన విజయమనుకునే తండ్రి, అతని పట్ల కఠినంగా వ్యహరించినా లోపల ఎంతో ప్రేమ దాచుకుని ఉంటారనేది ఈ చిత్ర కథ. ఇందులో తండ్రి పాత్రలో సముద్రఖని నటించారు. తండ్రి చనిపోయిన తర్వాత వచ్చే సీన్లు, నాన్న విలువ తెలుసుకొని కొడుకు బాధపడే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి.


సుస్వాగతం


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాస్ తెరకెక్కించిన 'సుస్వాగతం' సినిమా కూడా తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చాటి చెబుతుంది. కొడుకుకి అన్నివేళలా అండగా నిలిచే తండ్రి అవసరమైతే ప్రేమ విషయంలోనూ భావోద్వేగ మద్దతునిచ్చి ఒక ఫ్రెండ్ గా నిలబడతాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇందులో రఘువరన్, పవన్ లు తమ పాత్రల్లో జీవించారు. తండ్రి మరణించిన తర్వాత వచ్చే 'ఆలయాన హారతిలో' పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. 


మనం


అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన 'మనం' సినిమాలోనూ తండ్రి సెంటిమెంట్ ను ఆవిష్కరించారు. గత జన్మలో గొడవల వల్ల విడిపోయిన తల్లి తండ్రులను పునర్జ్మలో కలపాలనుకునే కొడుకు కథను.. దురదష్టవశాత్తూ ప్రమాదంలో మరణించిన అమ్మానాన్నలు మళ్లీ జన్మలో సంతోషంగా జీవించాలని ఆరాటపడే వృద్ధుడైన తనయుడి కథను ఈ చిత్రంలో చూపించారు. తెలుగులో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ చిత్రానికి విక్రమ్ కె కుమార్ దర్శకుడు. దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, శ్రియా సరన్, సమంత ప్రధాన పాత్రలు పోషించారు.


S/O సత్యమూర్తి


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినషన్ లో వచ్చిన చిత్రం 'S/O సత్యమూర్తి'. విలువలే ఆస్తిగా బ్రతికిన తండ్రి చనిపోతే, మరణానంతరం కూడా ఆయన గౌరవాన్ని కాపాడటానికి ఏ దశలోనూ విలువలు వదిలిపెట్టని కొడుకు కథ ఇది. ఇందులో తండ్రి కొడుకులుగా ప్రకాశ్ రాజ్, బన్నీ నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ ప్లే చేసిన 'అందరివాడు' మూవీలోనూ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ను చాలా బాగా చూపించారు.


చిరంజీవి 'డాడీ', ప్రకాశ్ రాజ్ - త్రిషల 'ఆకాశమంత', అజిత్ కుమార్ 'విశ్వాసం', విక్రమ్ 'నాన్న', మణిరత్నం 'అమృత' వంటి చిత్రాల్లో తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్ ను తెర మీదకు తీసుకొచ్చారు. సోలో, నేను శైలజ వంటి సినిమాలలోనూ కూతుర్ల మీద తండ్రికి ఎలాంటి ప్రేమ, బాధ్యత ఉంటాయనేది ప్రస్తావించారు. చక్రం, బలాదూర్, బ్రహ్మోత్సవం, విన్నర్ లాంటి మరికొన్ని చిత్రాల్లో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ వున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.