Telugu Movie Based On Fashion College: ఫ్యాషన్ కాలేజ్ నేపథ్యంలో హీరోయిన్ క్యారెక్టర్లు డిజైన్ చేసిన తెలుగు దర్శక రచయితలు కొందరు ఉన్నారు. అయితే... కంప్లీట్ ఫ్యాషన్ కాలేజ్ నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాలు అసలు లేవని చెప్పాలి. ఇప్పుడు ఆ జానర్ ఫిల్మ్ తీస్తున్నారు ఒక ఫ్యాషన్ డిజైనర్. పూర్తి వివరాల్లోకి వెళితే...


అరవింద్ జోషువా దర్శకుడిగా... 
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా (Aravind Joshua Fashion Designer) దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'పేషన్' (Passion Telugu Movie). స్టార్ డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి దగ్గర పని చేసిన ఆయన... ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టారు. ఇందులో సుధీష్ వెంకట్ హీరో. అంకిత సాహ, శ్రేయాసి షా హీరోయిన్లు. ఈ చిత్రాన్ని బి.ఎల్.ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ సంస్థలపై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.


ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీ నేపథ్యంలో... 
ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా 'పేషన్'ను రూపొందిస్తున్నట్లు అరవింద్ జోషువా తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. హైదరాబాద్ సిటీలోని కొన్ని ఫ్యాషన్ కాలేజీల్లో 20 రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ చేశారు, ఇప్పుడు రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి మూవీ టీమ్ రెడీ అయ్యింది.


Also Readపిఠాపురంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన శర్వా - Election Results 2024 వచ్చిన నెక్ట్స్ డే రామ్ చరణ్ అతిథిగా?


సినిమాతో పాటు షూటింగ్ గురించి దర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ... ''ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించి ఇంతకు ముందు ఎప్పుడూ తెలుగు తెరపై రానటువంటి ఓ సమగ్రమైన కథతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 'పేషన్' తీస్తున్నాం. తెలుగులో, ఆ మాటకు వస్తే ఇండియాలో ఈ తరహాలో వస్తున్న తొలి సినిమా 'పేషన్' అని చెప్పొచ్చు. ప్రేమ, ఆకర్షణ వంటి అంశాలకు సంబంధించి యువతలో ఉన్న అనేక ప్రశ్నలకు మా సినిమా సమాధానం అవుతుంది. మేం ఫస్ట్ షెడ్యూల్‌లో ప్రధాన సన్నివేశాలు కొన్ని షూట్ చేశాం. ఇప్పుడు రెండో షెడ్యూల్‌లో మరికొన్ని కీ సీన్స్ తీస్తాం'' అని అన్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు.


Also Readకాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శంకర్ - Indian 2 ఆడియోలో చందమామ పాత్రపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు



నిర్మాతలు మాట్లాడుతూ... ''అరవింద్ జోషువా న్యూ ఏజ్ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్. ఆయన రాసిన కథ మాకెంతో నచ్చింది. ఆల్రెడీ చేసిన ఫస్ట్ షెడ్యూల్ పట్ల మేం హ్యాపీగా ఉన్నాం. అనుకున్నట్టుగా సినిమా వస్తోంది. త్వరలో మిగతా ఆర్టిస్టుల వివరాలు చెబుతాం'' అని అన్నారు. సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కళా దర్శకత్వం: గాంధీ నడికుడికర్, ఛాయాగ్రహణం: సురేష్ నటరాజన్, కూర్పు: నాగేశ్వర్ రెడ్డి, నిర్మాణ సంస్థలు: బి.ఎల్.ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్, నిర్మాతలు: డా అరుణ్ కుమార్ మొండితోక - నరసింహ యేలె - ఉమేష్ చిక్కు, రచన - దర్శకత్వం: అరవింద్ జోషువా.