Aakasamlo Oka Tara Movie Opening: మలయాళ క్రేజీ హీరో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లతో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని దూసుకెళుతున్నాడు. టాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్ క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుంది తప్పితే.. అసలు ఇసుమంత కూడా తగ్గడం లేదు. ఆయనని దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ దర్శకులు కథలు రాస్తున్నారంటే.. దుల్కర్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న దుల్కర్‌కు తెలుగులో మరో స్ట్రయిట్ ఫిల్మ్ ఛాన్స్ వచ్చినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ స్ట్రయిట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఆదివారం (ఫిబ్రవరి 2) గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సేనాపతి’, ‘సావిత్రి’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మహామహులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, గుణ్ణం గంగరాజు సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు ఈ చిత్ర నిర్మాణంలో భాగమవుతుండటంతో.. ఈ సినిమాపై ఆటోమ్యాటిగ్గా అంచనాలు మొదలయ్యాయి. ఆ చిత్రమే ‘ఆకాశంలో ఒక తార’.
Also Read: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
‘ఆకాశంలో ఒక తార’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్తపు షాట్‌కు నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, మరో నిర్మాత అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల, ఇతర సిబ్బంది వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుందని తెలుస్తుంది.
ప్రస్తుతానికైతే సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్వేత సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఎన్నికైనట్లుగా చిత్రబృందం ప్రకటించింది. ‘లక్కీ భాస్కర్’ తర్వాత మరో తెలుగు దర్శకుడితో దుల్కర్ సినిమా చేస్తుండటంతో పాటు.. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండటంతో.. ఈ సినిమా కచ్చితంగా దుల్కర్‌కు మరో లక్కీ చిత్రంగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో నిర్మించేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్‌తో పాటు త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ తెలియజేయనున్నారు. దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఆయన తెలుగులో నటించిన ‘మహానటి’, ‘సీతా రామం’, ‘కల్కి 2898 AD’, రీసెంట్‌గా వచ్చిన ‘లక్కీ భాస్కర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ వరస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ని దుల్కర్ సొంతం చేసుకున్నారు. ఈ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం కూడా సక్సెస్ అయితే మాత్రం టాలీవుడ్‌లో ఇక దుల్కర్‌కి ఎదురులేదనే చెప్పుకోవచ్చు.
Also Read: మోస్ట్ హ్యాండ్సమ్ టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?