నం ఏ రంగంలోనైనా ఎదగాలంటే లౌక్యంగా నడుచుకుంటూ ముందుకి పోవాల్సిన అవసరం ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడేవారంటే ఎక్కడైనా ఎవరికీ పెద్దగా నచ్చరు. అందుకే ముఖస్తుతి చేసైనా తమ కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలని అంటుంటారు. నిజానికి అలాంటి భజన చేసేవారే జనాలను బాగా దగ్గరవుతారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ భజన అనేది చాలా అవసరమని చెప్పాలి. 

 

సినిమా అనే రంగుల ప్రపంచంలో చాలా పోటీ ఉంటుంది. అలాంటి పోటీని తట్టుకొని ఇండస్ట్రీలో రాణించాలన్నా, అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నా టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. అవగింజంత అదృష్టంతో పాటుగా సపోర్ట్ కూడా అవసరమే. అందుకే తమ కెరీర్ కోసం పలువురు నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు భజన చేస్తుంటారు. దర్శకుడు హీరోని, హీరో నిర్మాతను, నిర్మాత దర్శకుడిని, హీరోయిన్లు దర్శక హీరోలను.. ఇలా అందరూ అవసరాన్ని బట్టి పొగిడేస్తుంటారు. ఇలాంటి భజనను ఇష్టపడే వారు ఇండస్ట్రీలో చాలామందే ఉంటారు. కేవలం ముఖస్తుతి కోసమే అవార్డులు ఇచ్చే వ్యక్తులు ఉన్నారనే కామెంట్స్ ఎప్పటి నుంచో వింటున్నాం. 

 

మామూలుగా ఈ భజన లేదా ముఖస్తుతి అనేవి సినిమా ఫంక్షన్స్ లో, ఏదైనా సినీ కార్యక్రమాల్లో, ప్రెస్ మీట్స్ లో మనం తరచుగా చూస్తుంటాం. అది గొప్ప ఇది గొప్ప అంటూ ఒకరినొకరు మోసేసుకోవడం సహజమే. ఎవరు ఎవరిని పొగిడారన్నది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. సినిమాలు లేకపోతే హీరోలు.. దర్శక నిర్మాతలు పొగుడుతారు. మరోవైపు క్రేజీ హీరోల డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఆకాశానికి ఎత్తేస్తారు. ఇదంతా ఇండస్ట్రీలో సహజంగా జరిగే ప్రక్రియ. 

 

ఇక టాలీవుడ్ విషయానికొస్తే, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో ఎదగాలంటే మాత్రం కచ్చితంగా ఎవరో ఒకరికి భజన చేయాల్సిన అవసరం వుంది. మెగా కుంటుబానికో లేదా నందమూరి ఫ్యామిలీకో, మరేదైనా పెద్ద సినిమా ఫ్యామిలీకో విధేయుడై ఉండాలి. టైం దొరికినప్పుడల్లా వారిని పొగడ్తలతో ముంచెత్తాలి. అది వారి కెరీర్ కి ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తుందనేది తెలిసిన విషయమే. అందుకే కొందరు ఆ ఫ్యామిలీ హీరోల పేర్లు విన్నప్పుడు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. ఎక్కడాలేని అభిమానాన్ని చూపిస్తారు. వారంటే పిచ్చి అభిమానం అని నమ్మిస్తారు. ఇదంతా ఆ హీరోలకు తెలిసినా తెలియకపోయనా.. అభిమానులకు మాత్రం తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆయా నటులకు సపోర్ట్ చేయడం మొదలుపెడతారు.

 

అయితే ఈ భజన వల్ల అప్పుడప్పుడు నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అవకాశాల కోసం ఒకరిని పొగడటం వల్ల అవతలి వాళ్ళు నొచ్చుకొని దూరం పెట్టే అవకాశం వుంటుంది. ఇటీవల సీనియర్ నటుడు శివాజీ రాజా సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. తాను మెగా ఫ్యామిలీ భజన చేసేవాడినని.. కానీ, వారి నుంచి అవకాశాలేవీ రాలేదని.. ఆ భజన వల్ల మిగతా హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు రాలేదని తెలిపాడు.

 

మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో అభిమానమని, చిరంజీవి ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండటం వలన తనకు వేరే హీరోల సినిమాలు తక్కువగా వచ్చేవనడంలో కొంత నిజం ఉందన్నారు శివాజీ రాజా. అలాగని మెగా ఫ్యామిలీతో తాను ఎక్కువ సినిమాలలో నటించలేదని అన్నారు. ఏదేమైనా ఒక హీరోను ఎక్కువగా అభిమానించడం వలన అవకాశాలు తగ్గుతాయని ఇన్నాళ్లకు తెలిసిందన్నారు. ఇండస్ట్రీలో న్యూటరల్ గా ఉండాలని, అభిమానం ఉంటే మనసులో దాచుకోవాలని లేకుంటే ఇండస్ట్రీలో గుర్తింపు తగ్గుతుందని కొత్తగా వచ్చేవారికి శివాజీ రాజా సలహా ఇచ్చారు.

 

వాస్తవానికి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చేవారంతా మెగా ఫ్యామిలీ లేదా నందమూరి ఫ్యామిలీ భజన చేస్తున్నారు. ఒక యంగ్ హీరో లేదా హీరోయిన్ లేక ఎవరైనా నటుడిని ‘మీకు ఇష్టమైన హీరో ఎవరంటే’.. చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ లేదా ఎన్టీఆర్ అని చెప్పడం మనం చూస్తున్నాం. వారిలో మనస్ఫూర్తిగా నిజంగా అభిమానంతో చెప్పినవారు కొందరే ఉంటారని.. మిగతా వారంతా కేవలం అవసరం కోసమే అలా భజన చేస్తుంటారనే టాక్ ఉంది. ఏదేమైనా అందలం ఎక్కాలన్నా, తమ భవిష్యత్ కు బాటలు వేసుకోవాలన్నా చిత్ర పరిశ్రమలో భజన అవసరమే. కానీ అది మితి మీరకుండా చూసుకుంటేనే ఇండస్ట్రీలో ఎక్కువకాలం రాణించే ఛాన్స్ ఉంటుందని అర్థం చేసుకోవాలి.