Avatar: ‘అవతార్’ సినిమా సిరీస్ ల గురించి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పనవసరం లేదు. 2009 లో జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ మొదటి భాగం ఎలాంటి రికార్డులు సృష్టించిందో తెలిసింది. ఇప్పటి వరకూ ఉన్న ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన సినిమాగా ‘అవతార్’ నిలిచింది. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ ‘అవతార్ 2’ ను విడుదల చేశారు. ఈ మూవీ కూడా భారీగానే వసూళ్లను రాబట్టింది. అయితే మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం కాస్త తగ్గిందనే చెప్పాలి. అందుకే ప్రేక్షకులు మిగతా మూడు భాగాలపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు హాలీవుడ్ సినిమా లవర్స్ కు చేదు వార్త చెప్పింది డిస్నీ కంపెనీ. తమ సినిమాల లిస్ట్ లో విడుదల తేదీలు ఖరారు చేసిన సినిమాల రిలీజ్ డేట్లను మార్చుతున్నట్టు తెలిపింది. అందులో ‘అవతార్’ సిరీస్ సినిమాలు కూడా ఉన్నాయి. 


‘అవతార్’ సినిమా సీక్వెల్స్ రిలీజ్ తేదీల్లో భారీ మార్పులు..


హాలీవుడ్ లో భారీ సినిమాలను తెరకెక్కించే వాల్ట్ డిస్నీ కంపెనీ హాలీవుడ్ మూవీ లవర్స్ కు చేదు వార్త చెప్పింది. ఇప్పటికే రిలీజ్ డేట్లు కూడా అనౌన్స్ చేసిన చాలా సినిమాల విడుదల తేదీలను మారుస్తున్నట్టు ప్రకటించింది. అందులో ‘అవతార్’ సినిమా సిరీస్ లు కూడా ఉన్నాయి. వాస్తవానికి ‘అవతార్ 3’ సినిమా డిసెంబర్ 2024 కి బదులుగా డిసెంబర్ 2025లో విడుదల అవుతుందని డిస్నీ ప్రకటించింది. అలాగే ‘అవతార్ 4’ సినిమా 2026 నుంచి 2029 కి మారింది. ఇక ‘అవతార్’ సిరీస్ లలో చివరి భాగం అయిన ‘అవతార్ 5’ సినిమా 2028కి బదులుగా డిసెంబర్ 2031 లో థియేటర్లలోకి రానుంది. 


నిజానికి ‘అవతార్’ సినిమా 2009లో వస్తే ‘అవతార్ 2’ సినిమా దాదాపు 13 ఏళ్ల తర్వాత విడుదల చేశారు. దీంతో సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ బాగా ఎక్కువగా ఉండటంతో అది కలెక్షన్లపై ప్రభావం చూపింది. అందులోనూ ‘అవతార్ 2’ లో కథ కూడా అంతగా ఆకట్టుకోలేకపోవడం ఎమోషన్స్ సరిగా పండకపోవడంతో మూవీకు కాస్త డిమాండ్ తగ్గింది. దీంతో మిగిలిన సిరీస్ లపై ఆశలు పెట్టుకున్నారు మూవీలవర్స్. ఈ నేపథ్యంలో ‘అవతార్’ సిరీస్ ల మధ్య భారీ గ్యాప్ రావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.


మార్వెల్ సినిమాలదీ అదే పరిస్థితి..


ప్రపంచ వ్యాప్తంగా మార్వెల్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఆ సినిమాలకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు. అయితే ఇటీవల విడుదల చేసిన రీ షెడ్యూల్ లిస్ట్ లో డిస్నీ మార్వెల్ సినిమాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ‘ఎవెంజర్స్: కాంగ్ డైనాస్టీ’ విడుదల తేదీని మే 2025 నుండి మే 2026 వరకు వాయిదా వేసింది. అలాగే రాబోయే ఇతర మార్వెల్ సినిమాలు ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’ సినిమాను 2024 కు,  ‘థండర్‌బోల్ట్స్’ సినిమాను 2024 మార్చింది. మరికొన్ని మార్వెల్ మూవీలు , ‘బ్లేడ్’, ‘ఫెంటాస్టిక్ ఫోర్’ సినిమాలు 2025 కు మారుస్తూ కొత్త విడుదల తేదీలను ప్రకటించింది.  అలాగే రెండు స్టార్ వార్ సినిమాల రిలీజ్ డేట్లను కూడా 2026 కు మార్చింది డిస్నీ కంపెనీ.


Read Also: క్రెడిట్ ఇప్పటికీ వారికే దక్కుతుంది, ‘బాహుబలి’పై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు