GOAT: కోలీవుడ్‌ స్టార్ హీరో దళపతి విజయ్‌, డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌ లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 'Thalapathy 68' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమాకి 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌' (GOAT) అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రెండు స్పెషల్ పోస్టర్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే వాటిని చూసిన పలువురు నెటిజన్లు ఇదొక హాలీవుడ్‌ మూవీకి రీమేక్‌ అనే సందేహాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విజయ్ సినిమాను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ పెట్టిన సెటైరికల్ ట్వీట్ పై దర్శకుడు వెంకట్‌ ప్రభు స్పందించారు. 


‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అండ్ సెకండ్ లుక్ రిలీజ్ అయిన తర్వాత, ఇది విల్ స్మిత్ నటించిన ‘జెమినీ మ్యాన్’ అనే చిత్రానికి రీమేక్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఈ మేరకు ఓ నెటిజన్ ‘ఎక్స్‌’లో హీరో విజయ్ ను ట్రోల్ చేస్తూ ట్వీట్ పెట్టాడు. ‘‘విజయ్‌ సర్‌ 2023లో రెండు బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్‌ల తర్వాత 2024లోనైనా మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. కాబట్టి మీరు నిజంగా ఏదైనా రీమేక్‌ ప్లాన్ చేస్తుంటే, ఆయన హాలీవుడ్ చిత్రాల రీమేక్స్‌కు సరిపోడు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను అజిత్ కుమార్ లేదా మహేష్ బాబు కాదు'' అంటూ వెంకట్ ప్రభును ట్యాగ్ చేస్తూ సలహా ఇచ్చాడు. 


అంతటితో ఆగకుండా “మీరు విజయ్ ఫిల్మోగ్రఫీని గమనిస్తే, ఆయన కొన్ని మంచి తెలుగు రీమేకులతో మాత్రమే ఈ రంగంలో నిలదొక్కుకున్నాడు. కాబట్టి ఒక మంచి తెలుగు సినిమాని కొని రీమేక్ చేయమని ఒక సోదరుడిగా సూచిస్తున్నాను. మీకు ఖచ్చితంగా ఇప్పటికీ హాలీవుడ్ మూవీని రీమేక్ చేయాలనుకుంటే, దయచేసి మీ సినిమాలో హోప్ లెస్ దళపతి విజయ్ ఎలిమెంట్స్ అయిన బలవంతపు రొమాన్స్ & ముద్దులు, అసహజమైన ఫాదర్/సిస్టర్ సెంటిమెంట్‌లు లేకుండా చూసుకోండి. సినిమాని హిట్ చేయమని విజయ్ & టీమ్ మిమ్మల్ని బలవంతం చేస్తే, హాలీవుడ్ రీమేక్ అయిన గత చిత్రం 'లియో' ఫలితాన్ని గుర్తుచేసుకోమని వాళ్ళకి మర్యాదపూర్వకంగా చెప్పండి. అయితే ఈసారి రజినీకాంత్ ఫ్యాన్స్ లేదా అజిత్ కుమార్ అభిమానులు మీ GOAT మూవీ విషయంలో జోక్యం చేసుకోరు. ఎందుకంటే మేము మిమ్మల్ని చాలా గౌరవిస్తాము. హ్యాపీ అండ్ హెల్తీ 2024 సార్” అని ఆ నెటిజన్ ట్వీట్ లో పేర్కొన్నాడు. 


నెటిజన్ ట్వీట్ కి డైరెక్టర్ వెంకట్ ప్రభు తనదైన శైలిలో స్పందించారు. ''సారీ బ్రదర్‌. నేను మీ నుంచి ఇంకా ఎక్కువ ఆశిస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్‌. ప్రేమను పంచండి'' అని బదులిచ్చారు. మామూలుగానే సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ తో అందరి దృష్టిని ఆకర్షించే వెంకట్.. ఈసారి GOAT సినిమాపై, విజయ్ పై ట్రోలింగ్ చేసిన వ్యక్తికి కౌంటర్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. 


ఇదిలా ఉంటే ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ సంబంధిత పోస్టర్స్ లో విజయ్  ను రెండు పాత్రల్లో ప్రెజెంట్ చేసారు వెంకట్ ప్రభు. వయసు పైబడిన వ్యక్తిగా, యువకుడిగా ఫైటర్‌ జెట్‌ కాస్ట్యూమ్స్‌ లో చూపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఈ సినిమాలో దళపతి డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారా? లేక ఒక వ్యక్తి జీవితంలోని రెండు వేర్వేరు దశలను చూపించబోతున్నారా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మోహన్, జయరామ్, అజ్మల్ అమీర్, యోగి బాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 


Also Read: టాలీవుడ్@2024 - ఈ ఏడాది రిలీజయ్యే క్రేజీ చిత్రాలివే!