Director Maruthi About His Next Movie : ప్రభాస్ ది రాజా సాబ్ ఫెయిల్యూర్ తర్వాత డైరెక్టర్ మారుతి తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ నవమి సందర్బంగా తన తర్వాత మూవీపై ఎమోషనల్ పోస్ట్ చేశారు మారుతి.
ఎవ్రీ జర్నీ ఓ లెర్నింగ్
ఇండస్ట్రీలో ప్రతీ ప్రయాణం ఓ అభ్యాసమే అని అభిప్రాయపడ్డారు డైరెక్టర్ మారుతి. 'శ్రీరామనవమి సందర్భంగా ఆ రామయ్య ఆశీస్సులతో నా తదుపరి రచనకు తుది మెరుగులు దిద్దుతున్నందుకు నేను కృతజ్ఞుడిని. నన్ను నిరంతరం ఎంకరేజ్ చేస్తూ విలువైన అభిప్రాయాలను పంచుకుంటున్న ఆడియన్స్, శ్రేయోభిలాషులు, మీడియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీలో ప్రతీ ఒక్కరినీ నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. మీ ప్రశంసలు, సపోర్ట్ పొందడానికి నేను నా వంతు ప్రయత్నాలు చేసి, చిత్త శుద్ధితో కృషి చేస్తాను.' అంటూ ట్వీట్ చేశారు.
Also Read : మంత్ ఎండ్ ఓటీటీ మూవీస్ సందడి - ఒకే రోజు 13 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి వెరీ స్పెషల్
సంక్రాంతి స్పెషల్‌గా
ఈ ఏడాది సంక్రాంతికి ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ప్రభాస్ 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. హారర్ ఫాంటసీగా వింటేజ్ ప్రభాస్‌ను గుర్తు చేసేలా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శలు మూటగట్టుకుంది. పాన్ ఇండియా రేంజ్‌లో తీసినా... రిలీజ్ తర్వాత సోషల్ మీడియా వేదికగా మారుతిపై ట్రోలింగ్ సాగింది.
ఈ క్రమంలో పోగొట్టుకున్న చోటే మళ్లీ హిట్ కొట్టాలని మారుతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకోవడంతో త్వరలోనే ఈ మూవీ డీటెయిల్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది.
హీరో ఎవరంటే?
ఈ మూవీకి 'హే పొంగల్' అనే టైటిల్ ఫిక్స్ చేశారట. తనదైన మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. మరి హీరో ఎవరనే దానిపై సస్పెన్స్ వీడలేదు. మెగా హీరోతో ఈ మూవీ ట్రాక్ ఎక్కించేందుకు మారుతి ప్లాన్ చేస్తున్నారట. వరుణ్ తేజ్ ఆ హీరో అంటూ ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
ఏ సంక్రాంతికి అయితే విమర్శలు ఎదుర్కున్నారో అదే సంక్రాంతికి హిట్ కొట్టి జెండా పాతాలని చూస్తున్నారట. ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రానుంది. మారుతికి సన్నిహితంగా ఉండే ఓ నిర్మాణ సంస్థ ఇది నిర్మించనుందని ఫిలింనగర్ వర్గాల టాక్.
