మెగా హీరో రామ్ చరణ్, సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నది. దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథను అందించారు. డిఫరెంట్ మూవీస్ తో తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాకు కథ ఇవ్వడం ఆసక్తి కలిగిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాపై భారీగా అంచనాలు కూడా నెలకొన్నాయి.  


ఆ స్థాయి నాకు లేదనే కథ ఆయనకు చెప్పాను- కార్తీక్


అటు కార్తీక్‌ సుబ్బరాజు ప్రస్తుతం ‘జిగర్ తండ డబుల్‌ ఎక్స్’ అనే సినిమాను తెరకెక్కించారు. రాఘవ లారెన్స్ హీరోగా ఈ సినిమా రూపొందింది. మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న కార్తీక, ‘గేమ్‌ ఛేంజర్’ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కెరీర్ లో రాసిన తొలి పొలిటిక్ స్టోరీ ‘గేమ్‌ ఛేంజర్’ అన్నారు. “ఈ కథ ను పూర్తి చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ కు చెప్పాను. చాలా మంది ఈ కథ చాలా బాగుంది అన్నారు. శంకర్ సినిమాల స్థాయిలో ఈ కథతో మూవీ చెయ్యొచ్చు అన్నారు. కథను ఇంకా డెవల్ చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆయన స్థాయి రాజకీయ చిత్రం తీసే అనుభవం, స్థాయి నాకు లేదనుకున్నాను. అందుకే, ఈ కథను నేరుగా శంకర్ గారికి వినిపించాను. ఆయనకు నచ్చడంతో సినిమాగా రూపొందుతోంది. చాలా పెద్ద ఎత్తున ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. రామ్ చరణ్ నటించడంతో ఈ సినిమా స్థాయి మరింత పెరిగింది. ‘గేమ్‌ ఛేంజర్’ తప్పకుండా తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను అలరిస్తుంది” అని కార్తీక్ వెల్లడించారు.  


నవంబర్ 10న ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ విడుదల


ఇక ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ఇందులో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కథ ఓ ఫిల్మ మేకర్, గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో గ్యాంగ్ స్టర్‌గా రాఘవా లారెన్స్, దర్శకుడి పాత్రలో ఎస్.జె.సూర్య నటిస్తున్నారు.  లారెన్స్ ఈ మూవీలో పక్కా మాస్ గెటప్‌లో కనిపించాడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సైతం సినిమాపై భారీగా అంచనాలు పెంచింది.  ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు కథ, దర్శకత్వం వహించడంతో పాటు కార్తీక్ స్వయంగా నిర్మిస్తున్నారు.  తన సొంత బ్యానర్ స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ పై ఈ మూవీ తెరకెక్కింది.  నవంబరు 10న  రిలీజ్ కు రెడీ అవుతోంది.  


Read Also: నేనూ వాళ్లలా చేయాల్సింది - ఆఫీసులు చుట్టూ తిరిగినా ఛాన్సులు రాలేదు: శ్రీలీల, కృతిశెట్టిపై ఇనయా కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial