Dil Raju AI Lorven Studio Launched In Hyderabad: ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) 'లార్వెన్ ఏఐ' (Lorven AI) పేరుతో సరికొత్త టెక్నాలజీతో స్టూడియోను ప్రారంభించారు. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) చేతుల మీదుగా ఈ స్టూడియో ప్రారంభించారు. లోగోను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు ఫేమస్ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు, సుకుమార్, నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, ఇంద్రగంటి మోహనకృష్ణ, బాబీ, వీవీ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

విజయ్‌తో ఏఐ స్టూడియోలో సినిమా

ప్రస్తుతం తమ బ్యానర్‌లో యంగ్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని చెప్పారు. విజయ్ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్ధన్' మూవీ పనులు 'లార్వెన్' స్టూడియోలో జరుగుతున్నాయని తెలిపారు. అలాగే.. కొత్త వారితో 'తెల్ల కాగితం' అనే సినిమా చేస్తున్నామని, పులి లీడ్ రోల్‌లో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా మరో మూవీ చేయనున్నట్లు వెల్లడించారు. 

రెండేళ్ల క్రితమే ఏఐ స్టూడియో ప్రారంభించాలన్న ఆలోచన వచ్చిందని.. అలా 'క్వాంటమ్ ఏఐ'ను సంప్రదించినట్లు దిల్ రాజు తెలిపారు. 'సినిమాల్లో ఏఐ ఎంతగా ఉపయోగపడుతుందో చర్చించాం. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్.. ఇలా సినిమా నిర్మాణంలో ఏఐ భాగం కానుంది. ఏదైనా స్క్రిప్ట్ పూర్తైతే.. ఏఐ ద్వారా సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్‌తో మనం సినిమా చూసెయ్యొచ్చు. అదే మా మేజర్ టార్గెట్. ఏఐ ద్వారా మూవీ సక్సెస్ రేట్ చాలా పెరిగే ఛాన్స్ ఉంది. ఏఐ భవిష్యత్తులో సినీ నిర్మాణ రంగంలో మరిన్ని మార్పులు తీసుకొస్తుంది. దర్శక, రచయితలకు టైం.. నిర్మాతలకు మనీ సేవ్ అవుతుంది. దీంతో మరిన్ని చిత్రాలను తెరకెక్కించొచ్చు. 360 డిగ్రీస్‌లో సినిమాను ఏఐ ద్వారా ఎలా చెయ్యొచ్చనేది క్రియేటివ్‌గా డెవలప్ చేశాం. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారికి ఇది బాగా యూజ్ అవుతుంది.' అని దిల్ రాజు అన్నారు.

Also Read: రవితేజ ‘ఈగల్’, మహేష్ ‘శ్రీమంతుడు’ టు బన్నీ ‘అల వైకుంఠపురములో’, నాని ‘దసరా’ వరకు - ఈ ఆదివారం (మే 4) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్..

సినిమాకు అత్యాధునిక టెక్నాలజీ..

సినిమాకు అత్యాధునిక టెక్నాలజీ హంగులతో ఏఐ స్టూడియోను దిల్ రాజు ప్రారంభించడం అభినందనీయమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 'దిల్ రాజుతో నాకెప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయనతో పాటు టీంకు శుభాకాంక్షలు. ఇక్కడ చూపించిన వీడియోలతోనే 'లార్వెన్ ఏఐ' స్టూడియో ఎలాంటిదో అందరికీ అర్ధమైంది. టెక్నాలజీ విషయంలో మనం లీడర్స్ అని నిరూపితమైంది. ఈ స్టూడియో హైదరాబాద్‌తో పాటు తెలంగాణకు మరింత పేరు తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ మూవీస్, తెలుగు సినిమా 'కల్కి' టీమ్స్ ఏఐను ఉపయోగించాయి. సినీ ఇండస్ట్రీలో ఏఐ మార్పులు తీసుకొస్తుంది.' అని చెప్పారు.

లార్వెన్ పేరు వెనుక..

తాము ఆరాధించే వెంకటేశుని పేరే లార్వెన్. Lord లోని LOR, Venkateswaraలోని VEN కలిపి 'LORVEN' అనే పేరు పెట్టామని దిల్ రాజు సతీమణి తెలిపారు.