నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా నటించిన కోర్టు రూమ్ డ్రామా 'కోర్ట్'. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా  ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టారు. అందులో భాగంగా హీరో ప్రియదర్శి 'పుష్ప 2' వివాదానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అంశం ఈ మూవీలో ఉండబోతుందని స్పష్టం చేశారు. 


నాని 'కోర్ట్'పై పుష్పరాజ్ వివాదం ఎఫెక్ట్  


ఈ ఫ్రైడే థియేటర్లలోకి రాబోతున్న 'కోర్ట్' మూవీ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ప్రమోషన్లలో భాగంగా ప్రియదర్శి మాట్లాడుతూ 'పుష్ప 2' వివాదం ఈ మూవీలో ఉందని క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2 : ది రూల్' మూవీ వివాదం ఇండస్ట్రీలో పెను తుఫాను సృష్టించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద ఈ మూవీ రిలీజ్ టైంలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట సంఘటన అల్లు అర్జున్ ను ఒక రాత్రంతా జైల్లో ఉంచింది. ఆ టైమ్ లో అందరి దృష్టిలో పడ్డారు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఈ కేసులో ఆయన వాదించిన తీరుపై సర్వత్రా చర్చ నడిచింది. ఇక 'కోర్ట్' మూవీలో 'పుష్ప 2' కేసు విచారణ సమయంలో న్యాయవాది నిరంజన్ రెడ్డి ఉపయోగించిన భాషను గమనించిన తర్వాత, ఈ మూవీలోని 'కోర్ట్' సీన్స్ అతేంటిసిటీని పెంచడానికి మేకర్స్ డబ్బింగ్ సర్దుబాటు చేశారని ప్రియదర్శి స్వయంగా వెల్లడించారు. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.


నానితో మెగాస్టార్ ఫన్ మూమెంట్ 


అలాగే 'కోర్టు' మూవీ ప్రమోషన్స్ టైంలో నాని మెగాస్టార్ చిరంజీవితో జరిగిన ఒక మరిచిపోలేని సంఘటనను గుర్తు చేసుకున్నారు. "చైతూ పెళ్లి జరుగుతున్నప్పుడు నేను పెళ్లి వేదికపైకి అడుగు పెడుతున్నాను. అదే టైంలో అటువైపుగా వస్తున్న చిరంజీవి గారు నా దగ్గరకు వచ్చి, అకస్మాత్తుగా నిర్మాత గారూ అని అన్నారు. ఒక్క క్షణం నేను చుట్టూ చూశాను. అశ్విని దత్ లాంటి ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చారేమో అనుకున్నాను. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో నన్నే అంటున్నారా ? అని అడిగాను. వెంటనే అవును మీరే సార్ అని ఆయన నన్ను హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు" అంటూ చెప్పుకొచ్చారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న సినిమాను నాని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. 


మరోవైపు నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్న మూవీ 'కోర్ట్'. వాల్ పోస్టర్ సినిమా పతాకం పై ప్రశాంతి తిప్పిర్నేని నిర్మించిన ఈ మూవీలో హర్ష రోషన్, శ్రీదేవి, సాయికుమార్, శివాజీ, హర్షవర్ధన్, రోహిణి, సురభి, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. విజయ్ బుల్గాని ఈ మూవీకి సంగీతం అందించారు.


Also Read'గుండమ్మ కథ'లో కార్తీక దీపం మోనిత... ఫుల్ ఫ్యాషన్ గురూ - అదిదా ట్విస్ట్!