Murari Re Release: సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి 12 గంటల నుండే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మొదలయ్యింది. ఈ హీరోకు అభిమానులంతా విష్ చేస్తూ సోషల్ మీడియా మొత్తం పోస్టులతో నింపేశారు. అంతే కాకుండా ఇప్పట్లో మహేశ్ బాబు సినిమా ఏదీ థియేటర్లలో విడుదలకు అవకాశం లేదు. కానీ తన పాత సినిమాలు అయినా ‘మురారి’, ‘ఒక్కడు’ మాత్రం సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ అయ్యాయి. ఇక ‘మురారి’ సినిమాకు వెళ్లిన మహేశ్ బాబు ఫ్యాన్.. థియేటర్‌లోనే తన పార్ట్‌నర్‌ను పెళ్లి చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.


సీరియస్‌గా తీసుకున్నాడు..


మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘మురారి’ మూవీ రీ రిలీజ్ అని ప్రకటన రాగానే.. ఫ్యాన్స్ అంతా దీనికోసం ప్రిపరేషన్ మొదలుపెట్టారు. కొందరు ఫ్యాన్స్ అయితే అక్షింతలతో సిద్ధమయ్యారు. మరికొందరు అయితే థియేటర్‌లో ఎవరైనా అమ్మాయి నచ్చితే అక్కడే తాళి కట్టడానికి రెడీ అంటూ పసుపుతాడును కూడా సిద్ధం చేసుకొని సోషల్ మీడియాలో ఫన్నీ పోస్టులు పెట్టారు. కానీ అదంతా కామెడీ అని నెటిజన్లు భావించారు. ఒక అభిమాని మాత్రం దీనిని సీరియస్‌గా తీసుకున్నట్టు ఉన్నాడు. అందుకే థియేటర్‌లో ‘మురారి’ సినిమాలోని పెళ్లి సాంగ్ ప్లే అవుతున్న సమయంలో అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు.


రీ రిలీజ్ ట్రెండ్..


రీ రిలీజ్ సినిమాలకు వచ్చి స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయడం, రీల్స్ చేయడం, అందరూ కలిసి పాటలు పాడడం చాలా కామన్. కానీ సినిమాకు వచ్చి థియేటర్‌లో పెళ్లి చేసుకోవడం వెరైటీ కాబట్టి ఆ థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులంతా ఈ జంటను వీడియో తీశారు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరీ ‘మురారి’ సినిమాకు వచ్చి థియేటర్‌లోనే పెళ్లి చేసుకోవడం కొంచెం ఓవర్ అంటూ కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఇంట్లో చెప్పి వచ్చారా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.






ఇప్పటికీ ఫేవరెట్..


2001లో విడుదలయిన ‘మురారి’ మూవీ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. ఇందులో మహేశ్ బాబు నటన, ఫ్యామిలీ ఎమోషన్స్.. చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందుకే ఇలాంటి క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అనగానే మహేశ్ ఫ్యాన్స్ అంతా చాలా ఎగ్జైట్ అయ్యారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మహేశ్ బాబు, సోనాలి బింద్రే కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. మణిశర్మ అందించిన సంగీతంలో ఈ సినిమా పాటలను ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ వింటూనే ఉన్నారు. ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడు’ పాట ప్లే అవ్వకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ పెళ్లి జరగదు అన్నట్టుగా ఉంటుంది.



Also Read: నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్‌లు రాలేదు - సినిమా చెట్టుపై దర్శకుడు వంశీ వ్యాఖ్యలు