Film Shootings Start :వేతన పెంపు కోరుతూ సినీ కార్మికులు (Cine workers) ప్రారంభించిన సమ్మె ముగిసింది. 45 శాతం వేతనాలు పెంచాలని వర్కర్స్ ఫెడరేషన్ ఆందోళనలు ప్రారంభించింది. అయితే ఫిల్మ్ చాంబర్  మాత్రం చర్చించుకుందాం.. ముందు షూటింగ్‌లు కొనసాగించాలని స్పష్టం చేసింది. షూటింగ్‌లు ప్రారంభిస్తేనే వేతనాల పెంపుపై చర్చలు ఉంటాయని లేకపోతే నిరవధికంగా షూటింగ్‌లు నిలిపివేయడానికైనా సిద్ధమని హెచ్చరించారు. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద రెండు వర్గాలు చర్చలు జరిపాయి.  ఎవరికి వారు సమస్యను లాగడం సరి కాదని చర్చించి ఓ పరిష్కారానికి రావాలని తలసాని సూచించారు. 


తలసాని సమక్షంలో ఫిల్మ్ చాంబర్, వర్కర్స్ ఫెడరేషన్ చర్చలు


దీంతో అటు నిర్మాతల మండలికి చెందిన వారు.. ఇటు వర్కర్స్ ఫెడరేషన్‌కు సంబంధించిన వారు చర్చలు జరిపారు. రేపట్నుంచి షూటింగ్‌లు ప్రారంభిచాలని నిర్ణయించారు. వేతనాల పెంపు విషయం శుక్రవారం కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిపి నిర్ణయం తీసుకుంటారు. ఫిల్మ్ చాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ ద్వారా జీతాల చెల్లింపు ఉంటుందని సి.కల్యాణ్ ప్రకటించారు. శుక్రవారం ఛాంబర్, ఫెడరేషన్ దిల్ రాజు అధ్యక్షతన సమావేశం అవుతుంది. 


వేతనాలు పెంచేందుకు అంగీకరించారంటున్న ఫెడరేషన్


వేతనాలు పెంచడానికి ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు అంగీకరించాని ఎంత మేర పెంచుతారనేది శుక్రవారం క్లారిటీ వస్తుందని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపారు. మంత్రి సూచనతో చర్చలు జరిపామన్నారు. పెంచిన వేతనాలు కూడా శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయన్నారు. శుక్రవారం దిల్ రాజు సమక్షంలో జరిగే చర్చల్లో వేతనాల పెంపుపై విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. ఇరువర్గాలు కాస్త తగ్గేందుకు అంగీకరించడంతో  సమ్మె ముగియడానికి దారి లభించినట్లయింది.  


శుక్రవారం సమావేశం తర్వాత ఎంత వేతనాలు పెంచుతారన్నదానిపై క్లారిటీ


 సినీ కార్మికులు హఠాత్తుగా సమ్మె బాట పట్టడంతో రెండు రోజులుగా హైదరాబాద్‌ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు గత కొన్నిరోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే నిర్మాతల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో 24 విభాగాల కార్మికులు నేటినుంచి సమ్మెకు పిలుపునిచారు. ఇందులో భాగంగా సినీ కార్మికులు షూటింగ్‌లకు హాజరుకాలేదు. జూనియర్‌ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులను ఫెడరేషన్‌ సభ్యులు నిలిపివేశారు. దీంతో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌ పరిసరాల్లో 20కిపైగా చిన్న, పెద్ద సినిమాల చిత్రీకరణ ఆగిపోయింది. ఈ సమస్యకు రెండు రోజుల్లోనే పరిష్కారం లభించింది.