Choli Ke Peeche From Crew: లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. అలాంటిది ముగ్గురు స్టార్ హీరోయిన్లు కలిసి ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఎలా ఉంటుంది? ప్రస్తుతం బాలీవుడ్.. ఈ బడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అదే ‘క్రూ’. ఈ సినిమాలో కరీనా కపూర్, టబు, కృతి సనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ఇదేమీ రొటీన్ డ్రామా అనుకోకండి.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్. తాజాగా ఈ సినిమాలో నుంచి రెండో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాట కోసం ఒక ఫేమస్ బాలీవుడ్ సాంగ్‌ను రీమేక్ చేశారు మేకర్స్.


కరీనా కపూర్ మాత్రమే..


1993లో విడుదలయిన ‘ఖల్ నాయక్’ చిత్రంలోని ‘ఛోలీ కే పీచే క్యా హై’ పాటను ఇప్పటికీ బాలీవుడ్ ప్రేక్షకులు మర్చిపోరు. ఆ పాటను ఇప్పటికీ రెగ్యులర్‌గా వినేవాళ్లు ఉంటారు. అలాంటి ఒక క్లాసిక్ సాంగ్‌ను రీమేక్ చేయాలని ‘క్రూ’ టీమ్ నిర్ణయించుకుంది. తాజాగా ‘క్రూ’లోని ‘ఛోలీ కే పీచే’ పాట విడుదలయ్యింది. అందులో కరీనా తన హాట్ స్టెప్పులతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కానీ తాజాగా విడుదలయిన ఈ వీడియో సాంగ్‌లో టబు, కృతి మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఒక పార్టీ బ్యాక్‌డ్రాప్‌లో కరీనా ఒక్కరే ‘ఛోలీ కే పీచే’ పాటకు స్టెప్పులేస్తూ కనిపించింది. పింక్ శారీలో ఈ పాటకు డ్యాన్స్ చేసి యూత్‌ను మరోసారి ఆకట్టుకుంది ఈ కపూర్ బ్యూటీ.






ముగ్గురు ఎయిర్ హోస్టెస్‌‌ల కథ..


‘క్రూ’లోని ‘ఛోలీ కే పీచే’ పాటను అరుణ్‌తో పాటు దిల్‌జిత్ దోసాంజ్ పాడారు. దిల్‌జిత్ దోసాంజ్ ఈ సినిమాలో పాటలు పాడడం మాత్రమే కాదు.. కృతికి జోడీగా నటించాడు కూడా. మరో ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ ఫేమస్ కామెడియన్ కపిల్ కనిపించనున్నాడు. ఇక ఇందులో కృతి, కరీనా, టబు.. ముగ్గురు ఎయిర్ హోస్టెస్‌గా నటించారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో వారు ఏం చేస్తారనే కథాంశంతో ‘క్రూ’ తెరకెక్కిందని తాజాగా విడుదలయిన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రాజేశ్ ఏ కృష్ణన్.. ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలాజీ టెలీఫిల్మ్స్‌తో పాటు అనిల్ కపూర్ ఫిల్మ్ అండ్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కలిసి ‘క్రూ’ను నిర్మించారు.


క్రైమ్ కామెడీ..


ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్లు కూడా యాక్షన్ చేసే ట్రెండ్ నడుస్తోంది. అందుకే ‘క్రూ’లో ఒకరు కాకుండా ముగ్గురు హీరోయిన్లు తమ యాక్షన్‌ను చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఇక వెబ్ సిరీస్‌లతో డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన రాజేశ్ ఏ కృష్ణన్.. 2020లో తెరకెక్కించిన ‘లూట్‌కేస్’ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. అది కూడా ఒక క్రైమ్ కామెడీ చిత్రంగానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూలను అందుకుంది ‘లూట్‌కేస్’. ఇప్పుడు అదే తరహాలో ‘క్రూ’లాంటి మరో క్రైమ్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అయ్యింది.


Also Read: ఓటీటీలోకి వచ్చిన సారా దేశభక్తి సినిమా - డీటెయిల్స్ తెలుసుకోండి!