సుమన్.. తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. యాక్షన్ సినిమాలతో పాటు కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. భక్తి చిత్రాల్లోనూ చక్కటి పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ఎన్నో అద్భుత చిత్రాలు చేశారు. సౌత్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా ఖ్యాతి గడించారు. మొత్తంగా సుమన్ తన సినీ ప్రయాణం 44 ఏళ్లు పూర్తి చేసుకుని 45వ వసంతంలోకి అడుగు పెట్టారు.
తక్కువ సమయంలో స్టార్ హీరోగా గుర్తింపు
సుమన్ 1959, ఆగస్టు 28న చెన్నైలో జన్మించారు. ‘నీచల్ కులం’ అనే తమిళ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘తరంగిణి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ‘ఇద్దరు కిలాడీలు’ తెలుగు ప్రేక్షకులను బాగా అలరించారు. ‘నేటి భారతం’, ‘సితార’, ‘బావ బావమరిది’ సహా పలు వైవిధ్య భరిత చిత్రాలతో ఆకట్టుకున్నారు. తెలుగులో ఆయన 90కి పైగా చిత్రాల్లో నటించారు. కథానాయకుడిగా కొనసాగుతూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. తక్కువ సమయంలోనే తెలుగు, కన్నడ సినిమా పరిశ్రమల్లో అగ్ర హీరోగా ఎదిగారు. మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రావీణం ఉన్న సుమన్ యాక్షన్ సినిమాల ద్వారా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు. కుటుంబ కథా చిత్రాల ద్వారా ప్రేక్షకుల మదిని దోచారు. అందగాడైన సుమన్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉండేది. అప్పట్లో ఆయనంటే అమ్మాయిలకు ఎంతో క్రష్ ఉండేది. సుమన్ భక్తి సినిమాల ద్వారానూ ప్రేక్షకులను అలరించారు. ‘అన్నయమ్య’ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో అచ్చం వేంకటేశ్వర స్వామిలా కనిపించి జన నీరాజనం అందుకున్నారు.
సుమన్ కు చిరంజీవి అభినందనలు
సుమన్ సినీరంగంలోకి వచ్చి 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. సుమన్ సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. సుమన్ పై అభినందనలు కురిపించారు. ‘మై డియర్ బ్రదర్ సుమన్.. యాక్టర్ గా మీరు 45 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 10 భాషలలో 150కి పైగా సినిమాలు చేయడం అత్యంత గొప్ప విషయం. మీరు సాధించిన గొప్ప విజయం. సినిమాలు అంటే మీకు ఎంత ఇష్టం ఉందో, సినిమాల పట్ల మీరు ఎంత కమిట్‌మెంట్ తో ఉంటారో చెప్పడానికి ఈ 45 ఏండ్లలో మీరు చేసిన సినిమాలే నిదర్శనం. ఇంకా మరిన్ని సంవత్సరాలు లక్షలాది అభిమానులు, ప్రేక్షకులను ఇలానే అలరిస్తారని ఆశిస్తున్నాను. ఫిబ్రవరి 16న మంగళూరులో మీ 45 ఏళ్ళ కెరీర్ ని పురస్కరించుకొని ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విన్నాను. ఈ వేడుక సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చిరంజీవి తెలిపారు.
Read Also: ప్రేమకు లింగ బేధాలుండవు - నటి జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్యలు