తెలుగు సినిమాను... భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వివిధ భాషలకు చెందిన సినిమాలను... ఆ మాటకు వస్తే ప్రపంచ సినిమాను పైరసీ భూతం పట్టి పీడిస్తోంది. సినిమాలు నెట్టింట లీక్ అవుతాయి. ఇప్పుడు సినిమాలు కాదు... ఏకంగా స్క్రిప్ట్స్ లీక్ అయ్యాయి. అది కూడా ఒకట్రెండు సినిమాల స్క్రిప్ట్స్ కాదు... 500 సినిమాల స్క్రిప్ట్స్ నెట్టింట లీక్ అయ్యాయి. అది కూడా సెన్సార్ బోర్డుకు చెందిన సినిప్రమాణ్ పోర్టల్ సెక్యూరిటీ లీపం వల్ల. ప్రస్తుతం చిత్రసీమలో హాట్ టాపిక్ ఇది.
రిలీజ్ కాని సినిమా స్క్రిప్ట్స్ కూడా లీక్!సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు ఒక వెబ్సైట్ ఉంది. ఆ పోర్టల్‌లో సెన్సార్ సర్టిఫికేట్ కోసం దర్శక నిర్మాతలు సినిమా స్క్రిప్ట్స్, ఇతర సమాచారాన్ని ఇస్తారు. సెన్సార్ బోర్డు వైపు నుంచి చోటు చేసుకున్న భద్రతా లోపం వల్ల సెన్సార్ సర్టిఫికేషన్ కోసం నిర్మాతలు సమర్పించిన సుమారు 500కి పైగా సినిమాలకు చెందిన సమాచారం ఆన్లైన్లో లీక్ అయినట్లు సమాచారం. చిత్రసీమలో వ్యక్తులకు భరోసా కల్పించాల్సిన సంస్థల్లో ఒకటైన సెన్సార్ బోర్డులో ఇటువంటి లీక్స్ జరగడం పలువురిని విస్మయానికి గురి చేసింది.
సినిమాలు లీక్ కాలేదు... స్క్రిప్ట్స్ మాత్రమే!సినిమాలు, కథలను లీక్స్ జరగకుండా చూసుకోవాల్సిన, భద్రపరచాల్సిన సెన్సార్ బోర్డు పోర్టల్‌లో డేటా లీక్ జరగడం పట్ల చిత్రసీమ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. సెన్సార్ కోసం నిర్మాతలు దరఖాస్తు చేసుకునే CBFC అఫీషియల్ వెబ్ పోర్టల్ 'ఇ-సినిప్రమాణ్' (e-Cinepramaan)లో భద్రతా లోపం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం... లీక్ అయిన వాటిలో ఇంకా విడుదల కాని పలు సినిమాల ఒరిజినల్ స్క్రిప్ట్‌లు, సెన్సార్ కట్ ఆర్డర్లు, సర్టిఫికేషన్ రికార్డులు ఉన్నట్లు తెలిసింది.
లీకైన సమాచారంలో స్క్రిప్ట్‌లు మాత్రమే కాకుండా పలు భారతీయ, అంతర్జాతీయ సినిమాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్లు, లైసెన్సింగ్ ఫీజ్, రెవెన్యూ షేరింగ్ అగ్రిమెంట్స్, రైట్స్ వివరాలు కూడా ఉన్నాయట. దాంతో సినిమా బిజినెస్ మీద ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సినిప్రమాణ్ పోర్టల్‌కు చెందిన సెక్యూరిటీ వ్యవస్థలో లోపం వల్ల ఆ సమాచారాన్ని 'ఇంటర్నెట్ ఆర్కైవ్'లో అప్లోడ్ చేసినట్లు ఢిల్లీ ఖబర్. సంబంధిత అధికారులు నెట్టింట లీకైన విషయాన్ని గుర్తించి... తప్పును సరిదిద్దుకునే లోపే ఆ ఫైళ్లు ఎవరైనా సరే ఇంటర్నెట్ నుంచి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయట.
కొందరు ప్రచారం చేస్తున్నట్టు 500 సినిమాలు లీక్ కాలేదని, సెన్సార్ సర్టిఫికేషన్ కోసం సమర్పించిన డాక్యుమెంట్లు, స్క్రిప్ట్‌లు మాత్రమే లీక్ అయ్యాయని సెన్సార్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. అలాగే, సినిప్రమాణ్ పోర్టల్‌పై సెక్యూరిటీ ఆడిట్ మొదలు పెట్టారు.
