‘‘బాలీవుడ్ నన్ను భరించలేదు’’ అంటూ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇప్పటికే ‘హిందీ’ జాతీయ భాష కాదంటూ దక్షిణాది తారలు చేస్తున్న కామెంట్లపై ఎలా స్పందించాలో తెలియక తికమక పడుతున్న బాలీవుడ్ పెద్దలకు ఇప్పుడు మహేష్ బాబు వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా జాతీయ మీడియా దీన్ని పెద్ద వివాదంగా మార్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్, నిర్మాతలు దర్శకుల అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. 


మహేష్ బాబు వ్యాఖ్యలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ‘‘మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టలేం. ఎక్కడ సినిమాలు చేయాలి? ఎలాంటి కథలను ఎంచుకోవాలనేది పూర్తిగా నటుడి సొంత నిర్ణయం. కానీ, బాలీవుడ్ నన్న భరించలేదు అనే వ్యాఖ్యలు నాకు అర్థం కాలేదు. బాలీవుడ్ అంటే సంస్థ కాదు. మీడియానే ఆ పేరును సృష్టించింది’’ ఆర్జీవీ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.


Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!


తాజాగా ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూడా స్పందించారు. ‘‘ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయం వెల్లడించే హక్కు ఉంది. కానీ, నేను ఇప్పుడు కేవలం బాలీవుడ్ కాదు. దక్షిణాది సినీ పరిశ్రమలో కూడా పనిచేస్తున్నాను. నేను రెండు వైపులా ఉన్నందువల్ల దీనిపై వ్యాఖ్యానించలేను. నేను తమిళం, తెలుగు రెండు భాషల్లోనూ సినిమాలు చేశాను.. త్వరలో మలయాళం, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాను. అందువల్ల, దీనిపై వ్యాఖ్యానించడానికి నేను సరైన వ్యక్తి కాకపోవచ్చు. హిందీ పరిశ్రమపై ఆయన ఆ వ్యాఖ్యలు చేయడానికి తగిన కారణాలు ఉండవచ్చు. తనకు ఏది అనిపిస్తే అది చెప్పే హక్కు మహేష్ బాబుకు ఉంది’’ అని అన్నారు. బోనీ కపూర్ చాలా దక్షిణాది చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. నిర్మాతగా ఆయన తన కేరీర్‌ను ఆరంభించింది కూడా దక్షిణాది చిత్రంతోనే. ఆయన మొదటి చిత్రం ‘హమ్ పాంచ్’.. కన్నడ చిత్రం ‘పడువారల్లి పాండవరు’కి రీమేక్. ఆ తర్వాత అనిల్ కపూర్‌తో తీసిన ‘వో సాథ్ దిన్’ చిత్రం ‘అంధా 7 నాట్కల్’ మూవీకి రీమేక్. ఈ రెండు చిత్రాలకు బాపు దర్శకత్వం వహించడం గమనార్హం.


Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?