రీసెంట్గా 'జవాన్'(Jawan) మూవీతో బాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టి భారీ సక్సెస్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకి తాజాగా బీ టౌన్లో మరో పెద్ద ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏకంగా బాలీవుడ్ టాప్ డైరెక్టర్ తన సినిమాలో లీడ్ రోల్ కోసం నయనతారని సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ బీ టౌన్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇప్పటికే సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పుడు నార్త్ లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా షారుక్ ఖాన్‌కి జోడిగా 'జవాన్'(jawan) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నయనతార పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టేసింది. దీంతో బాలీవుడ్లో నయన్‌కి వరుస ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్లో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన సంజయ్ లీల భన్సాలీ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో నయనతార నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు సంజయ్ లీలా భన్సాలీ. ప్రస్తుతం ఆయన 'బైజు బావ్రా'(Baiju Bawra) అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రణవీర్ సింగ్, ఆలియా భట్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సినిమాలో మరో కీలక పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్లుగా సమాచారం. రీసెంట్‌గానే కథ విన్న నయనతార కథ బాగా నచ్చిందని అన్నారట. ఈ ఏడాది మార్చిలో ముంబైలోని సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ దగ్గర నయనతార తన భర్త విగ్నేశివన్తో కలిసి కనిపించింది. అయితే అది 'బైజు బావ్రా' సినిమా కోసమే అని తెలుస్తోంది.
దీంతో సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో నయనతార నటించబోతుందనే వార్త బాలీవుడ్ ఫిలిం సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 1952లో విజయ్ భట్ అనే దర్శకుడు 'బైజు బావ్రా' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో భరత్ భూషణ్, మీనా కుమారి ప్రధాన పాత్రలో నటించారు.
బైజు అనే వ్యక్తి ఆధారంగా ఈ సినిమా సాగుతుంది. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం మొగల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడైన తాన్ సేన్‌ను ఓ సంగీత పోటీలో ఓడించడాని సవాలు చేసిన బైజు అనే యువ సంగీతకారుడి చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అదే చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ రీమేక్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక 'జవాన్' తో భారీ సక్సెస్ అందుకున్న నయనతార ప్రస్తుతం కోలీవుడ్‌లో ప్రముఖ యూట్యూబ్ డ్యూడ్ విక్కీ దర్శకత్వంలో 'మన్నన్ గట్టి'(Mannan Gatti) అనే మూవీలో నటిస్తోంది.
Also Read : ఒంటిపై చైతన్య పేరును చెరిపేసిన సమంత