సేనాపతి ఈజ్ బ్యాక్. 28 ఏళ్ల కిందట అవినీతి పరుల అంతం చూసిన సేనాపతి.. మళ్లీ వచ్చాడు. ఈ సారి చాలా స్టైలిష్‌గా.. మరిన్ని విద్యలను నేర్చుకుని అప్‌డేట్ అయ్యాడు. మరింత అవినీతితో కుళ్లిపోతున్న సమాజాన్ని కాపాడేందుకు తిరిగి వచ్చాడు. రెండో స్వాతంత్ర్య ఉద్యమానికి నాంది పలికాడు. ‘‘ఏంటీ ఇంత ఆవేశం’’ అనుకోవద్దు.. ట్రైలర్‌లో విషయాన్ని జనరలైజ్ చేస్తే అలా అనిపిస్తుంది.


‘భారతీయుడు’ సినిమా చూసినవారికి సేనపతి గురించి తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడైన సేనపతి.. అవినీతిని చూసి కుంగిపోయాడు. నాకెందుకులే అని వదిలేయకుండా అవినీతిపరులను అంతం చేసే బాధ్యతను తీసుకున్నాడు. లంచం తీసుకోవాలంటేనే భయపడేలా సమాజాన్ని మార్చాడు. అయితే, ఇదంతా అప్పుడు. మరి, ఇప్పటి సమాజాన్ని ఎవరు కాపాడుతారు? అంటూ నేటి సిస్టమ్‌ గురించి ఈ ట్రైలర్‌లో ప్రస్తావించారు. చదువుకు తగ్గ జాబ్ ఉండదు. జాబ్‌కు తగిన జీతం ఉండదు. సంపాదనతో కట్టే ట్యాక్స్‌కు తగినట్లుగా సదుపాయాలు ఉండవు అంటూ మరో ఉద్యమానికి తెరలేపుతాడు సిద్ధార్థ్ అండ్ అతడి ఫ్రెండ్స్. కుప్పల్లా పేరుకుపోయిన అవినీతిని క్లీన్ చేసేందుకు అప్పట్లో ఒకరు ఉండేవారంటూ.. సేనాపతి గురించి సిద్ధార్థ్ ప్రస్తావిస్తాడు. అప్పుడే.. నేనున్నాంటూ తెరపైకి వస్తాడు. ‘భారతీయుడు 2’.. ఈ సారి మరింత అప్‌డేటెడ్‌గా. 


సిద్ధార్థ్‌కు తాత?


ట్రైలర్‌లో ఒక చోట.. సిద్ధార్థ్ చెప్పే డైలాగ్ వింటే సేనపతికి అతడికి తాత ఏమో అనిపిస్తుంది. ‘‘చిన్నప్పటి నుంచి నిజాయతీగా ఉండాలి. అబద్దం ఆడకూడదు. దొంగతనం చెయ్యకూడదు అని మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక.. ఇవన్నీ చేస్తేనే బతకగలం అంటున్నారు?’’ అంటూ సేనాపతి (కమల్)ను ప్రశ్నిస్తున్న సీన్ ఉంటుంది. దీన్ని బట్టి సిద్ధార్థ్.. సేనపతి కొడుకు (‘భారతీయుడు’లో యంగ్ కమల్ హాసన్)కు కొడుకై ఉండవచ్చని తెలుస్తోంది. మనవడు అవినీతి ఉద్యమం, బయటి పరిణామాలు.. సేనాపతిని తిరిగి వచ్చేలా చేస్తాయని అర్థమవుతోంది. 


అలాగే.. సేనాపతి చేసే హత్యలను అడ్డుకోడానికి పోలీసులు ప్రయత్నించడం.. ఈ సందర్భంగా అప్పట్లో సేనాపతిని పట్టుకోడానికి ప్రయత్నించిన పోలీస్ అధికారిని పోలీసులు సంప్రదించడం వంటి సీన్స్‌ను ట్రైలర్‌లో చూడవచ్చు. ఇక విలన్ విషయానికి వస్తే.. ఎస్‌జే సూర్య మిలినియర్‌గా కనిపించాడు. అతడే.. ప్రభుత్వాన్ని శాసిస్తూ.. సిస్టమ్‌ను చేతుల్లో పెట్టుకున్నట్లుగా మూవీలో చూపించి ఉండవచ్చు. 


ఫన్ ఎలిమెంట్స్‌తో సేనాపతి అప్‌డేట్..


గత ‘భారతీయుడు’లో సేనాపతి చాలా సీరియస్ క్యారెక్టర్‌లో కనిపించారు. అప్పటి తరానికి ఆ పాత్ర సూట్ అయ్యింది. అయితే, నేటి తరానికి సేనాపతి పాత్ర కనెక్ట్ కావాలంటే.. కాస్త చురుకుదనం యాడ్ చెయ్యాలి. దర్శకుడు శంకర్ ఆవిధంగానే కథ రాసుకున్నట్లు ‘భారతీయుడు 2’ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సేనాపతిలో మనకు ఒక ‘రెమో’ (శంకర్ క్రియేట్ చేసిందే) కనిపిస్తాడు. అలాగే ఒక పొలిటీషియన్ కనిపిస్తాడు. అలాగే మర్మకళతోపాటు.. ఎలాంటి వారినైనా మట్టుబెట్టే టెక్నిక్‌ నేటి సేనాపతికి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. సింగిల్ వీల్ స్కూటర్‌పై చేసే పోరాట సన్నివేశాలను చూస్తే.. ఔరా అనిపించక మానదు. 


కాజల్ ఎక్కడ? 


‘భారతీయుడు 2’లో కాజల్ కూడా నటించింది. అయితే, ట్రైలర్‌లో ఎక్కడా ఆమె కనిపించలేదు. బహుశా.. ఆమెదే ఇందులో కీల్ రోల్ కావచ్చు. అందుకే ఆమె పాత్రను రివీల్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. ఇక రకుల్ సిద్ధార్థ్ ప్రియురాలిగా నటించింది. అయితే, ఉద్యమంలో మాత్రం అతడితో కనిపించదు. కేవలం ప్రియా భవానీ శంకర్‌తో కలిసే ఉద్యమం చేస్తాడు. ట్రైలర్ మొత్తం కమల్ హాసన్, సిద్ధార్థ్, ప్రియాభవానీ శంకర్, రకుల్ ప్రీత్ చుట్టూనే తిరిగింది. ప్రతినాయకుడు సూర్య పాత్రను కూడా పూర్తిగా రివీల్ చేయలేదు. ప్రేక్షకులు కథను అంచనా వేయకుండా జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. చివరిగా ఈ మూవీలో అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్‌గానే ఉంది. అలాగే, సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా శంకర్ మార్క్‌లో తరహాలో గ్రాండ్‌గా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 


Also Read: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!