Bengali Serial Actor Rahul Banerjee Died In Drown Accident : బెంగాళీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ మృతి చెందారు. సీరియల్ షూటింగ్ జరుగుతున్న టైంలో జరిగిన నీటి ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. షూటింగ్ టైంలో ఊహించని ఘటన అందరినీ షాక్‌కు గురి చేసింది.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాహుల్ తన తాజా షో 'భోలే బాబా పార్ కరేగా' షూటింగ్ నిమిత్తం ఒడిశాలోని తలసరి బీజ్‌కు వెళ్లారు. ఆదివారం సాయంత్రం షూటింగ్ చేస్తుండగా... నీటిలో పడవపై వెళ్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన్ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షూటింగ్‌పై ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, పర్మిషన్ కూడా తీసుకోలేదని ఒడిశా పోలీసులు తెలిపారు. దీనిపై తలసరి, దిఘా అధికారులు కలిసి విచారణ చేస్తున్నారు. 43 ఏళ్ల వయసులో ప్రముఖ నటుడు ఇలా ప్రాణాలు కోల్పోవడంపై బెంగాళీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సహచర నటులు, ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
Also Read : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం - విలక్షణ నటుడికి మాతృ వియోగం
సీఎం దిగ్భ్రాంతి
రాహుల్ బెనర్జీ మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఇక లేరన్న వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందని... రాహుల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
భార్య ప్రియాంక ఎమోషనల్ నోట్
రాహుల్ మరణ వార్తపై ఆయన భార్య ప్రియాంక సర్కార్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు. ఇది తమకు అత్యంత బాధాకరమైన సమయమని, తమ ప్రైవసీ గౌరవించాలని కోరారు. 2010లో ప్రియాంకను రాహుల్ వివాహం చేసుకోగా వీరికి ఓ కుమారుడు ఉన్నారు. 2017లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆరేళ్ల పాటు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కొడుకు కోసం అన్నింటినీ పక్కన పెట్టి మళ్లీ ఒక్కటయ్యారు.
రాహుల్ సినీ కెరీర్
కోల్‌కతాలో జన్మించిన రాహుల్ అరుణోదయ్ బెనర్జీ చిన్నప్పటి నుంచీ నటనపై మక్కువతో ఇండస్ట్రీకి వచ్చారు. 2008లో వచ్చిన 'చిరోదిని తుమీ జే అమర్' మూవీతో బిగ్ ఫేమ్ అయ్యారు. బెంగాళీ ఇండస్ట్రీలో ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత లవ్ సర్కస్, షానో మాన్ బోలీ తొమయ్, నా హన్యతే, జాక్ పాట్, లవ్ సర్కస్ వంటి మూవీస్‌తో మెప్పించారు.
అలాగే, దేశార్ మాటీ, గీతా ఎల్ఎల్‌బీ, తుమీ అస్బే బోలే సీరియల్స్‌లోతో బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా రూపొందించారు. కెరీర్ పరంగా మంచి స్థానంలో ఉండగా ఈ ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది.
