Bellamkonda Sreenivas Upcoming Movie Update: ఈరోజుల్లో హీరోలంతా కొత్త కథకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాలనే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఆ విషయాన్ని గ్రహించిన యంగ్ హీరో.. మొదటిసారి తన కెరీర్‌లో ఒక ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఆ హీరో మరెవరో కాదు.. బెల్లంకొండ వారసుడు సాయి శ్రీనివాస్. గత కొన్నేళ్లుగా తాను నటించిన సినిమాలు ఏవీ మినిమమ్ హిట్లు అందుకోలేకపోతున్నాయి. అందుకే తాను కూడా రూట్ మార్చి ఒక కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యాడు.


కొత్త జోనర్..


బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు మూడేళ్లు అయిపోయింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టాలనే కోరికతో రెండేళ్ల పాటు ‘ఛత్రపతి’ రీమేక్‌కే సమయాన్ని కేటాయించాడు. కానీ హీరోగా తాను ఎంత కష్టపడినా ‘ఛత్రపతి’ రీమేక్‌ మాత్రం బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఘోరమైన డిసాస్టర్‌గా నిలిచింది. అందుకే మళ్లీ టాలీవుడ్ బాటపట్టాడు సాయి శ్రీనివాస్. ఇక్కడే కథలు వింటూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ‘టైసన్ నాయుడు’ అనే మూవీని ప్రకటించిన శ్రీనివాస్.. మొదటిసారి ఒక కొత్త జోనర్‌లో మూవీ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.


న్యూ ఏజ్ హారర్..


షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తన కెరీర్‌లోని 11వ చిత్రాన్ని ప్రకటించాడు. ఇది ఒక న్యూ ఏజ్ హారర్ మిస్టరీ అని, ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని ఇప్పుడే మాటిచ్చేస్తున్నారు మేకర్స్. వెలుగుకు, చీకటికి మధ్య జరిగే పోరాటం అంటూ ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీని యంగ్ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ‘చావు కబురు చల్లగా’ అనే డిఫరెంట్ లవ్ స్టోరీతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన కౌశిక్.. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేసే హారర్ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నాడు.






వర్కవుట్ అయ్యే సినిమా..


ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లో 11వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ హారర్ మిస్టరీ గురించి ఇంకా ఏ అప్డేట్ బయటికి రాలేదు. ఇక మొదటిసారి ఈ యంగ్ హీరో రూటు మార్చి కొత్త జోనర్‌లో సినిమా చేస్తుండడంతో ప్రేక్షకులు సైతం దీని గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటిసారి తన సినిమా గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేయకుండా.. పోస్టర్‌ను చూసి ఇది వర్కవుట్ అయ్యే సినిమా అని అంచనా వేస్తున్నారు చాలామంది నెటిజన్లు. హారర్, మిస్టరీ సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్‌లో స్పెషలిస్ట్ అనిపించుకున్న అజనీష్ లోక్‌నాథ్.. ఈ మూవీకి సంగీతాన్ని అందించడానికి సిద్ధమయ్యాడు.



Also Read: ‘జైలర్’ సీక్వెల్ కోసం టైటిల్ ఫిక్స్ - ప్రీ ప్రొడక్షన్‌కు అంతా సిద్ధం