Barack Obama’s favourite films of 2024: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురంచి అందరికి తెలిసిందే. మార్పు తీసుకొస్తానంటూ 2008లో అమెరికా ప్రెసిడెంట్ అయిన ఒబామా.. వరుసగా రెండుసార్లు అధ్యక్ష పదవిని చేపట్టాడు. ఆ తర్వాత 2016లో పదవి నుంచి దిగిపోయాక సోషల్ మీడియాలో తను సందడి చేస్తున్నారు. తనకు ఆసక్తి కలిగించిన విషయాలు, ఇష్టాయిష్టాల గురించి అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ తన ఫాలోవర్లను మురిపిస్తుంటారు. తాజాగా తను పెట్టిన పోస్టులో భారత సినిమా గురించి ఉండటం భారతీయుల్ని అలరిస్తోంది. మరి ఒబామకు ఇష్టమైన భారతీయ చిత్రం ఏంటో తెలుసా.. ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. 


బోలెడు అవార్డులు..
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా ఈ చిత్రాన్ని రూపొందించారు. అంతర్జాతీయ యవనికపై ఈ చిత్రం ఎన్నో అవార్డులు సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముంబైలోని ఒక నర్సింగ్ హోంలో పని చేసే ఇద్దరు కేరళ నర్సుల కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని చూసిన పలువరు అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రం సత్తా చాటి గ్రాండ్ ప్రి అవార్డు గెలుచుకుంది. అలాగే 82వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి కూడా నామినేటై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం చూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా తనకు 2024లో నచ్చిన సినిమాలలో ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ అనే చిత్రం ప్రథమ స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. నిజానికి ఈ కథ ఒబామను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. 






నిజ జీవితం ఆధారంగా..
ఈ సినిమా గురించి దర్శకురాలు పాయల్ గతంలో వివరించారు.  స్క్రిప్ట్‌ను రాయడం తాను 2018లో మొదలు పెట్టానని, ఆ సమయంలోనే మా బంధువులు ఒకరు ఆస్పత్రిలో ఉన్నారని తెలిపారు. చాలా రోజులు వారికి తోడుగా అక్కడే ఉండాల్సి వచ్చిందని,  ఆస్పత్రిలో నర్సులతో ఎక్కువగా గడిపే అవకాశం దొరికిందని పేర్కొన్నారు. అక్కడ ఉన్న నర్సుల్లో చాలా వరకు కేరళకు చెందిన వాళ్లేని,  వారందరి జీవితాన్ని తాను ఎంతో దగ్గరగా చూసినట్లు తెలిపారు. దీన్నే సినిమాగా తీయాలని భావించి, స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దానని, అలా మొదలైందే ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ అని పేర్కొన్నారు. 


ఈ చిత్రాన్ని నటుడు రానా తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్‌ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారని తెలిపారు. రానా, ఆయన బృందం ఈ సినిమాను, తన తపనను పూర్తిగా అర్థం చేసుకున్నారని ప్రశంసించారు. తాను ఈ కథ కోసం పడిన కష్టాన్ని, సినిమా పట్ల తన అంకిత భావాన్ని వాళ్లు రానా అండ్ కో గుర్తించారని, కేన్స్‌లో ప్రదర్శించిన చిత్రం కాబట్టి.. వాళ్లకు దీని గురించి తెలిసే ఉంటుందనే ఉద్దేశంతో తాను రానాను కలిసినట్లు పేర్కొన్నారు. గతనెలలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


Also Read: Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు