చిదంబరం (Director Chidambaram) పేరు తెలుగు ప్రేక్షకులకు తెలుసో లేదో గానీ ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మంజుమ్మేల్ బాయ్స్' (Manjummel Boys) అయితే తప్పకుండా తెలిసే ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా 'బాలన్ ది బాయ్' (Balan The Boy). తెలుగులోనూ 'మంజుమ్మేల్ బాయ్స్' హిట్ కావడంతో, ఇప్పుడీ 'బాలన్ ది బాయ్'ను కూడా తెలుగులో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. లేటెస్టుగా తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఆ ట్రైలర్ డబ్బింగ్ విషయంలో విమర్శలు వస్తున్నాయి. తెలుగు ప్రేక్షకుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
తెలుగు డబ్బింగ్... మినిమమ్ కేర్ తీసుకోరా?'బాలన్ ది బాయ్'లో చిదంబరం చెప్పాలనుకున్న కథపై గానీ, ఆయన చూపించిన విజువల్స్ మీద గానీ ఎటువంటి అభ్యంతరాలు లేవు. గ్రిప్పింగ్ స్టోరీతో సినిమా తీశారని అర్థం అవుతోంది. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం అసలు బాలేదని చెప్పాలి. డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పించారా? లేదంటే ఏఐ ఉపయోగించారా? అనే సందేహాలు సైతం వ్యక్తం అయ్యాయి.
డబ్బింగ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు వ్యతిరేకం కాదు. మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలే కాదు... కొత్తవాళ్ళతో తెరకెక్కిన 'ప్రేమలు' వంటి సినిమాలను కూడా బాగా ఆదరించారు. అయితే ఇటువంటి వరస్ట్ డబ్బింగ్ ఉండటం అంటే తెలుగు ప్రేక్షకులకు గౌరవం ఇవ్వనట్టే. ట్రైలర్ చూసి సినిమాకు రావాలనుకున్న ప్రేక్షకులు సైతం ఆగిపోతారు.
'బాలన్: ది బాయ్' కథ విషయానికి వస్తే... ఓ చిన్న పిల్లాడు, అతని తల్లి చుట్టూ సినిమా తిరుగుతుంది. వాళ్ళిద్దరి జీవితంలో జరిగిన ఓ ఘటన వల్ల ఏమైంది? ఇద్దరి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అనేది సినిమా కథగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ సంగీత దర్శకుడు. వివేక్ హర్షన్ ఎడిటింగ్, షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మించారు. జూన్ 19న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.
