Balakrishna New Movie With Gopichand Malineni: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం 'అఖండ 2' (Akhanda 2) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ కోసం బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ నెక్స్ట్ మూవీపైనా హైప్ నెలకొనగా.. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దీనిపై బిగ్ అప్ డేట్ ఇచ్చారు.
అప్పటి నుంచి ప్రారంభం
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దర్శకుడు గోపీచంద్.. 'అఖండ 2' తర్వాత బాలకృష్ణతో మూవీ చేయబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10న దీన్ని ప్రారంభించనున్నామని ఆయన ప్రకటించారు. ఈ సినిమాను మరో నిర్మాణ సంస్థతో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మించనుంది.
అంతకు ముందు బాలయ్య, గోపీచంద్ కాంబోలో వచ్చిన 'వీర సింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇప్పుడు రెండోసారి వస్తోన్న ఈ మూవీపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.
బాలీవుడ్‌కు హిట్ ఇచ్చిన గోపీచంద్
తాజాగా.. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో పవర్ ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ తీసి అక్కడ కూడా సత్తా చాటారు గోపీచంద్ మలినేని. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దాదాపు రూ.84 కోట్లకు పైగా వసూలు చేసింది. త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపైనా ఆయన స్పందించారు. అలాంటి వాటిని పట్టించుకోనని అన్నారు.
'సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయం వారిది. నేను ఒక దేవుడిని ఆరాధిస్తే.. వేరొకరికి మరో దేవుడిపై నమ్మకం ఉంటుంది. ఇలా దేవుడి విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు సినిమాల విషయం వేరే వేరే ఒపీనియన్స్ ఉండడం సహజమే. కొన్ని సినిమాలు కొందరికి నచ్చితే.. కొన్ని సినిమాలు కొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి వాటి గురించి నేను ఆలోచించకుండా నా పని నేను చేసుకుంటూ పోతాను.' అని గోపీచంద్ తెలిపారు.
ఆ తర్వాతే 'జాట్ 2' ప్రారంభం
'జాట్' మంచి హిట్ సాధించిన క్రమంలో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఇటీవలే చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' అధికారికంగా ప్రకటించింది. బాలకృష్ణతో మూవీ పూర్తైన తర్వాతే 'జాట్ 2' గురించి ఆలోచిస్తానని గోపీచంద్ అన్నారు. 'జాట్' స్క్రిప్ట్ సమయంలోనే 'జాట్ 2' ఐడియా వచ్చిందని.. ఫస్ట్ పార్ట్‌ను మించి రెండో పార్ట్ ఉంటుందని చెప్పారు.
జాట్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించగా.. సన్నీతో పాటు, రణదీప్ హుడా, ప్రశాంత్ బజాజ్, సయామి ఖేర్, రెజీనా కాసాండ్రా, వినీత్ కుమార్ సింగ్, జగపతిబాబు, రమ్యకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. రణదీప్ హుడా నెగిటివ్ రోల్‌లో మెప్పించారు. తమన్ సంగీతం అందించారు. మరోవైపు.. ఈ సినిమాలో మతపరమైన సన్నివేశంపై విమర్శలు రాగా.. మూవీ టీం దాన్ని తొలగించి క్షమాపణలు చెప్పింది.