Balakrishna At Satyabhama Trailer Launch Event: కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేస్తున్న చిత్రమే ‘సత్యభామ’. కాజల్ అగర్వాల్ తన కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేసినా అందులో చాలావరకు కమర్షియల్ హీరోయిన్‌గానే కనిపించింది. కానీ మొదటిసారి ఒక లేడీ ఓరియెంట్ చిత్రంతో, అది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్షన్ చూపించడానికి వచ్చేస్తోంది. మేలో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. ఇప్పుడు జూన్‌కు పోస్ట్‌పోన్ అయ్యింది. అయినా కూడా ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ‘సత్యభామ’ టీమ్. తాజాగా గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. దానికి చీఫ్ గెస్టులుగా అనిల్ రావిపూడి, బాలకృష్ణ వచ్చారు.
ప్రచారం ముగిసింది..
బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జోడీగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందుకే తన తరువాతి సినిమా అయిన ‘సత్యభామ’ను సపోర్ట్ చేయడానికి అనిల్ రావిపూడి, బాలకృష్ణ ముందుకొచ్చారు. ముందుగా ‘సత్యభామ’ ట్రైలర్ ఈవెంట్‌కు వచ్చిన అందరికీ విషెస్ చెప్తూ తన స్పీచ్‌ను మొదలుపెట్టారు బాలయ్య. ‘‘మొన్నే ఎలక్షన్స్ ప్రచారం అయిపోయింది. షూటింగ్ మొదలుపెట్టేద్దాం అని మంచి ఊపులో వచ్చాను. కానీ ఇప్పటివరకు షూటింగ్ మొదలుపెట్టలేదు. 45, 50 రోజులు ఏం మిస్ అయ్యానో అది ఈ ఫంక్షన్ ద్వారా తీర్చుకుంటున్నాను. కెమెరాను చాలా మిస్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ‘సత్యభామ’ సినిమాకు పనిచేసిన అందరికీ తన ఆశీస్సులు తెలిపారు.
ఉగాది పచ్చడి..
‘‘కొన్ని పేర్లు తలచుకోగానే మనలో ఒక వైబ్రేషన్ వస్తుంది. అలాంటి వాటిలో సత్యభామ పేరు కూడా ఒకటి. కిలికించితనాలు అని కొన్ని పదాలు ఉంటాయి. మేము ఆదిత్య 369లో అలాంటి పదాలు వాడాం’’ అంటూ ఆ సినిమాలోని ‘జానవులే’ పాటను ఆలపించారు బాలయ్య. తాను ఎప్పుడూ శ్రీకృష్ణుడు.. పారిజాతాన్ని హరించడానికి వెళ్లినప్పుడు వచ్చే పద్యాన్ని స్మరిస్తూ ఉంటానని బయటపెట్టారు. ‘‘మహిళా సాధికారితకు కూడా పేరు సత్యభామే. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఉండొచ్చు. కానీ ఆయనను తన చెప్పుచేతల్లో పెట్టుకున్న భార్య సత్యభామ’’ అని అన్నారు. ఇక ‘సత్యభామ’ సినిమాలో కాజల్ చేసిన ఫైట్స్, యాక్షన్‌ను ప్రశంసించారు. ఆర్టిస్టులు అనేవాళ్లు ప్రయోగాలు చేస్తుండాలి అన్నారు. అన్నింటిని రంగరించి ఉగాది పచ్చడిలాగా ‘సత్యభామ’ను తెరకెక్కించారని మేకర్స్‌ను ప్రశంసించారు.
16 ఏళ్లు పూర్తి..
మూవీ కెమెరామ్యాన్‌ను ప్రశంసిస్తూ.. తాను కూడా మొదట్లో కెమెరామ్యాన్ అవ్వాలి అనుకున్న విషయాన్ని బయటపెట్టారు బాలకృష్ణ. ‘‘అన్ని క్రాఫ్ట్స్ మీద ఒక అవగాహన ఉండాలి అనుకునేవాడిని’’ అన్నారు. ఇక కాజల్ ఇండస్ట్రీకి వచ్చిన 16 ఏళ్లలో ఎన్నో పాత్రలు చేసిందని తెలిపారు. ఒక బిడ్డను కూడా కని తిరిగి ఇండస్ట్రీకి రావడం చాలా గొప్ప విషయమని అన్నారు. ‘‘హీరోయిన్‌గా చేసినవారు తల్లి పాత్రలో, అక్క పాత్రలో చేస్తే అదే ముద్రపడిపోతుంది అంటారు. దాన్ని బ్రేక్ చేసినవాళ్లు చాలా తక్కువమంది ఉన్నారు. వాళ్లలో కాజల్ ఒకరు. ఆమె డెడికేషన్ ముందు తరాలకు ఆదర్శం. ఆమె ఒక ఫైర్‌బ్రాండ్’’ అని తెలిపారు బాలయ్య. తన తండ్రి ఎన్‌టీఆర్ గురించి, ఆయన సినిమాల గురించి గర్వంగా చెప్పుకొచ్చారు. చివరిగా జూన్ 7న విడుదలయ్యే ‘సత్యభామ’ను థియేటర్లలో చూడమని ప్రేక్షకులను కోరారు బాలకృష్ణ.
Also Read: సత్యభామ ట్రైలర్ వచ్చేసింది - యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్