Balakrishna - Nayanthara: బాలకృష్ణకు జంటగా మరోసారి నయనతార... ఈసారి హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలో!
NBK 111 Movie Updates: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ నయనతార - ఇద్దరికీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ఇప్పుడు మరోసారి రిపీట్ అవుతోంది. కొత్త సినిమాలో ఇద్దరూ కలిసి నటించనున్నారు.

గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. బాపు దర్శకత్వం వహించిన 'శ్రీరామరాజ్యం' చిత్రంలో తొలిసారి ఈ జంట నటించింది. అందులో సీతారాములుగా కనిపించింది. ఆ తరువాత 'సింహా'లో మరోసారి జంటగా నటించారు. అదీ బ్లాక్ బస్టర్ అయ్యింది. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ తీసిన 'జై సింహ'తో హ్యాట్రిక్ అందుకున్నారు. ఇప్పుడీ జంట మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో...
బాలకృష్ణ కథానాయకుడిగా 'వీర సింహా రెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). ఇప్పుడు వాళ్ళిద్దరి కలయికలో మరొక సినిమా రూపొందుతోంది. అది బాలకృష్ణ 111వ సినిమా (NBK 111 Movie). ఆ సినిమాలో కథానాయికగా నయనతారను ఎంపిక చేశారని తెలిసింది. ఇంతకు ముందు మైథాలజీ, కమర్షియల్ యాక్షన్ ఫిలిమ్స్ చేసిన ఈ జంట... ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తోంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో నయనతార నటిస్తోంది. ఆ సినిమా తర్వాత ఆవిడ అంగీకరించిన తెలుగు సినిమా బాలకృష్ణది. అయితే... నందమూరి నట సింహంతో డబుల్ హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుడుతోంది నయన్.
నవంబర్ 7న పూజతో మొదలు...
ప్రస్తుతం 'అఖండ 2 తాండవం' విడుదల కోసం బాలకృష్ణ ఎదురు చూస్తున్నారు. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణతో పాటు డబ్బింగ్ కూడా పూర్తి చేశారు ఆయన. డిసెంబర్ 5న ఆ సినిమా విడుదల కానుంది. అంత కంటే ముందు... నవంబర్ 7వ తేదీన పూజా కార్యక్రమాలతో గోపీచంద్ మలినేని చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం డిసెంబర్‌లో మొదలు కానుంది.
Also Read: చిరంజీవి - బాబీ కొల్లి సినిమాలో తమిళ్ హీరో... సేమ్ ఫార్ములా రిపీట్?
దర్శకుల పని తీరు నచ్చితే మళ్లీ మళ్లీ వాళ్లకు అవకాశాలు ఇవ్వడం బాలకృష్ణకు అలవాటు. బోయపాటి శ్రీనుతో ఆయన చేస్తున్న నాలుగో సినిమా 'అఖండ 2'. 'వీర సింహా రెడ్డి' తరువాత గోపీచంద్ మలినేనికి మరొకసారి అవకాశం ఇచ్చారు. తన వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడితో మరొక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బహుశా గోపీచంద్ మలినేని సినిమా పూర్తి అయ్యాక క్రిష్ సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.
Also Read: నిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!





















