నందమూరి బాలకృష్ణ క్లాసిక్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఆదిత్య 369'. దాదాపు 3 దశాబ్దాల తరువాత ఈ థ్రిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ రీరిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవలే మూవీని ఏప్రిల్ 11 న రీరిలీజ్ చేయబోతున్నాం అని అధికారికంగా ప్రకటించారు. కానీ అంతకంటే వారం ముందుగానే ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్టు ఈ రోజు తెలిపారు.
'ఆదిత్య 369' రీ రిలీజ్ డేట్ ఛేంజ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సెన్సేషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఆదిత్య 369'. దివంగత దిగ్గజ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో, శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఫస్ట్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే. ఇందులో కృష్ణదేవరాయలుగా నందమూరి బాలయ్య యాక్టింగ్, సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ స్కిల్స్, ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రం, ఇళయరాజా అద్భుతమైన మ్యూజిక్, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ విలువలు, జంధ్యాల సంభాషణలు వంటి ఈ సినిమాలో ఉన్న ప్రతి అంశం 'ఆదిత్య 369' మూవీని ఆల్ టైం క్లాసిక్ మూవీగా నిలబెట్టాయి.
1991లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను అప్పట్లోనే సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. ఈ ఫిక్షనల్ టైం ట్రావెల్ సినిమాలో హిస్టారికల్ తో పాటు మూడు జానర్లను టచ్ చేసి అద్భుతంగా తెరకెక్కించారు. అయితే చాలా కాలంగా 'ఆదిత్య 369' మూవీ రిలీజ్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. రీసెంట్ గా సరికొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా ఈ మూవీని తీర్చిదిద్ది, రీ రిలీజ్ కు సిద్ధమవుతున్నామని గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఏప్రిల్ 11న 'ఆదిత్య 369' మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని వారం ముందుగానే రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించారు.
మూవీ రీరిలీజ్ ప్రీ పోన్ కావడానికి ఇదే రీజన్ 'ఆదిత్య 369' సినిమాను ఏప్రిల్ 11న కాకుండా పీ పోన్ చేసి, ఏప్రిల్ 4న రీరిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ "ఆదిత్య 369 అనే సంచలనాత్మక సినిమాను 5.1 సౌండ్ మిక్సింగ్ తో, అధునాతనమైన 4k డిజిటల్ క్వాలిటీతో థియేటర్లలోకి తీసుకురాబోతున్నాము. నందమూరి బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుగానే కాకుండా మరో పాత్రలో కూడా నటించి, ఆ రోజుల్లోనే ఈ మూవీతో అందరినీ ఆకట్టుకున్నారు. జీనియస్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు అద్భుతమైన విజన్ తోనే 'ఆదిత్య 369' ఇండియన్ సినిమాలో ఆల్ టైం క్లాసిక్ హిట్ గా చేరింది. అలాంటి అద్భుతమైన సినిమాను ఈ తరం యూత్ కోసం ఏప్రిల్ 11న రీ రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించాము. కానీ మరిన్ని ఎక్కువ థియేటర్లలోకి మూవీని తీసుకురావాలని ఉద్దేశంతో ఇప్పుడు ఏప్రిల్ 4న రీరిలీజ్ చేస్తున్నాము" అని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్యతో పాటు అమ్రిష్ పురి, మోహిని, హీరో తరుణ్, సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, చలపతిరావు, చంద్రమోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.