Ashu Reddy Father Reaction Over Her Daughter Issue : బిగ్ బాస్ ఫేం, సినీ నటి అషు రెడ్డి వ్యవహారం ఆదివారం నుంచి హాట్ టాపిక్‌గా మారింది. తన కుమారుడి వద్ద రూ.9 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఆరోపిస్తూ... ఆమెపై, ఫ్యామిలీపై కూడా షేక్ పేట్‌కు చెందిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై అషు రెడ్డి తండ్రి వెంకట కృష్ణారెడ్డి స్పందిస్తూ... షాకింగ్ నిజాలు వెల్లడించారు.
'వారికి కాల్ మనీతో సంబంధాలు'
తమ అమ్మాయి మోసం చేసిందని ఆరోపించిన సత్యనారాయణకు కాల్ మనీతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు వెంకట కృష్ణా రెడ్డి. '2021లో కాకినాడ నుంచి సత్యనారాయణ తనను తాను పరిచయం చేసుకుని పెళ్లి సంబంధం గురించి మాట్లాడాడు. వాళ్ల అబ్బాయి, మా అమ్మాయి కలిసి ఉద్యోగం చేశారని అలా పరిచయం అయ్యారని చెప్పాడు. దీంతో సదరు ధర్మేంద్ర కుటుంబం గురించి ఎంక్వైరీ చేయించాను. అప్పటికే అతనికి పెళ్లై విడాకుల కేసు నడుస్తోందని తెలిసింది.
అంతే కాకుండా సత్య నారాయణ నడుపుతున్న ఫైనాన్స్ కంపెనీపై కాల్ మనీ కేసు ఉన్నట్లు తెలిసింది. దీంతో సంబంధం వద్దని నేరుగా చెప్పలేక తర్వాత చెబుతామని నానుస్తూ వచ్చాం. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఆయన గురించి వింటున్నా.' అని చెప్పారు.
Also Read : ధనుష్ టాప్ ట్రెండింగ్ మూవీస్ - ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'నా బిడ్డ అమాయకురాలు'
తన బిడ్డ అమాయకురాలని... ఆమెకు ఏమీ తెలియదని చెప్పారు వెంకట కృష్ణారెడ్డి. 'నేను వైజాగ్‌లో ఉంటా. మా అమ్మాయి తల్లితో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. నాకు ఆమె ఇండస్ట్రీకి వెళ్లడం ఇష్టం లేదు. తల్లి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వెళ్లింది. అషు రెడ్డికి ఏమీ తెలియదు. అమాయకురాలు.
ధర్మేంద్రతో ఆర్థిక వ్యవహారాల గురించి నాకు ఏమీ తెలీదు. మాపై చేసినవన్నీ ఆరోపణలు మాత్రమే. ఏమైనా సాక్ష్యాలు ఉంటే నిరూపించుకోవాలి. ప్రస్తుతం మా అమ్మాయి వేరే చోట ఉంది. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ అసలేం జరిగిందో చెబుతుంది. ఇదే సంగతి నాతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు చెప్పింది.' అని చెప్పారు.
అసలేం జరిగిందంటే?
తన కుమారుడు ధర్మేంద్రను పెళ్లి పేరుతో అషు రెడ్డి రూ.9.35 కోట్ల మేర మోసం చేసిందంటూ షేక్ పేట్‌కు చెందిన సత్యనారాయణ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధర్మేంద్ర లండన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడని... 2018లో భారత్‌కు వచ్చిన టైంలో పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానని చెప్పి డబ్బులు అడిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరిట బంగారం, కార్లు, ఆస్తులు కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకుందని ఆరోపించారు.
ఆ తర్వాత అషు రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ సంబంధం అంటూ హడావుడి చేసి పెళ్లి పేరెత్తితే మొహం చాటేస్తున్నారని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు. మరోవైపు, అషు రెడ్డి దీనిపై స్పందించారు. తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
