AR Rahman Discharge From Hospital: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ కారణంగా ఆయన ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారని.. ఈ మేరకు చికిత్స తీసుకున్నారని ఆయన సోదరి రిహానా వెల్లడించారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు.
ఛాతీ నొప్పితో కాదు..
అయితే, రెహమాన్ ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురి కాగా.. ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రెహమాన్‌కు ఛాతీ నొప్పి కాదని.. డీహైడ్రేషన్ కారణంగానే స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ఆయన కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
ఇక సినిమాల విషయానికొస్తే.. రెహమాన్ ఇటీవలే 'ఛావా' సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వచ్చిన 'RC16' మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఈ మూవీలో ఇప్పటికే రెండు పాటలు కంపోజ్ చేసినట్లు ఇటీవలే వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం లండన్‌లో ఓ మ్యూజిక్ కళాశాలతో కలిసి ఈవెంట్ నిర్వహించిన ఆయన ఇటీవలే చెన్నైకు తిరిగివచ్చారు.