నుష్క శెట్టిని ఇష్టపడని సినీ అభిమాని ఎవ్వరూ ఉండరు. ‘బాహుబలి’ మూవీ తర్వాత అనుష్కకు పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు వచ్చాయి. అయితే, అనుష్క వెంటనే సినిమాలు చేయలేదు. కేవలం ‘భాగమతి’, ‘నిశబ్దం’ సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల విశ్రాంతి తీసుకుంది. సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది స్వీటీ. దీంతో ఆమె అభిమానులు చాలా ఆసక్తిగా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. సోమవారం టీజర్ కూడా విడుదల కానుంది. అయితే, ఇండస్ట్రీలో అనుష్క గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అనుష్క భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. 


హీరోలతో సమానంగా..


తెలుగులో మన హీరోలతో సమానంగా అనుష్కకు డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అనుష్క ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రూ.3 కోట్ల వరకు తీసుకున్న అనుష్క ఇప్పుడు ఒక్క మూవీకి రూ.6 కోట్ల పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, తన కమ్ బ్యాక్ మూవీ ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ మూవీకి రూ.3 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలిసింది.


అనుష్క నటిస్తోన్న ఈ 48వ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వీరు నిర్మించిన 'మిర్చి', 'భాగమతి' చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ మూవీ కూడా హిట్ కొడితే.. హ్యాట్రిక్ చేసినట్లే. ఈ చిత్రానికి మహేష్ బాబు.పి దర్శకత్వం వహించారు. గతంలో ఈయన సందీప్ కిషన్, రెజీనాల 'రారా కృష్ణయ్య' చిత్రాన్ని తెరకెక్కించారు. 


సెప్టెంబర్ 7న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విడుదల


తొలుత 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'ని ఆగస్టు 4న విడుదల చేయాలని భావించారు. అయితే, ఆ తేదీన సినిమా విడుదల చేయడం లేదని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా వేయక తప్పలేదని నిర్మాణ సంస్థ వెల్లడించింది. దీంతో ఈ మూవీ ఆగస్టు 18న విడుదల అవుతుందని భావించారు. ఆ ఊహాగానాలకు తెర దించుతూ... సెప్టెంబర్ 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. 


‘జీ5’ ఓటీటీలో విడుదల?


‘మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలిశెట్టి’ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ‘Zee5’ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నట్లయితే.. ఓటీటీలో ఆలస్యంగా విడుదల కావచ్చు. ఈ మూవీలో న‌వీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టితోపాటు అభినవ్ గోమఠం, మురళీ శర్మ, తులసి తదితరులు నటించారు. నిర్మాత‌లు:  వంశీ - ప్రమోద్, ర‌చ‌న‌ & ద‌ర్శకత్వం: మ‌హేష్ బాబు.పి, సంగీతం: రధన్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు, ఛాయాగ్రహణం:  నిర‌వ్ షా, నృత్యాలు:  రాజు సుంద‌రం & బృందా, ప్రొడ‌క్షన్ డిజైన‌ర్‌: రాజీవ‌న్‌.