క హీరోయిన్‌కు ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా గుర్తింపు లభిస్తే చాలు.. ఇక మేకర్స్ అంతా తనకు బ్యాక్ టు బ్యాక్ లేడీ ఓరియెంటెడ్ కథలనే వినిపిస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథలకు సూట్ అయ్యే నటి కీర్తి సురేశ్. ‘మహానటి’లాంటి చిత్రంతో తన నటన ప్రతిభ ఏంటో అందరికీ చూపించిన ఈ భామ.. ఇప్పుడు మరొక లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘రఘు తాత’. హోంబేల్ ఫిల్మ్స్ లాంటి పాపులర్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక గ్లింప్స్ విడుదలయ్యింది.


కయల్విరి వచ్చేస్తుంది..
ఇప్పటికే ‘రఘు తాత’ నుంచి కీర్తి సురేశ్ క్యారెక్టర్ గ్లింప్స్ విడుదలయ్యింది. దాన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో కీర్తి.. ఒక టీచర్ పాత్రలో కనిపించనుందని స్పష్టమవుతోంది. ఇక తాజాగా విడుదలయిన మరో గ్లింప్స్ కూడా ఒక స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంది. ముందుగా ఈ గ్లింప్స్‌లో ఒక బోర్డ్‌పై ‘హిందీ వర్డ్ ఆఫ్ ది డే’ అని ఉండి.. దాని కింద ‘పరీక్ష’ అని రాసుంటుంది. ఆ తర్వాత కీర్తి సురేశ్ వచ్చి హిందీ, పరీక్ష రెండు పదాలను చెరిపేస్తుంది. అప్పుడే ఆ బోర్డ్‌పై ‘రఘు తాత’ అని టైటిల్ కనిపిస్తుంది. హోంబేల్ ఫిల్మ్స్.. సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ‘మిమ్మల్ని నవ్వించడానికి, మీ మనసులు గెలుచుకోవడానికి, ఒక విప్లవం సృష్టించడానికి మీ కయల్విరి సిద్ధమయ్యింది. రఘు తాతకు సిద్ధమవ్వండి. త్వరలోనే మీ అభిమాన థియేటర్లలో’ అంటూ క్యాప్షన్‌తో ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది హోంబేల్ ఫిల్మ్స్.


ఆ సినిమాలోని సీన్ ఆధారంగా..
‘రఘు తాత’ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కీర్తి సురేశ్‌తో పాటు ఎమ్ఎస్ భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనంద్‌సామి, రాజేశ్ బాలకృష్ణన్.. ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షేన్ రోల్డన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. 1981లో భాగ్యరాజ్ తెరకెక్కించిన ప్రముఖ తమిళ చిత్రం ‘ఇండ్రు పోయి నాలై వా’ సినిమాలోని ఒక ప్రముఖ కామెడీ సీన్ ఆధారంగా ‘రఘు తాత’ తెరకెక్కిందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీన్‌లో టీచర్‌గా ఉండే రాధికా శరత్‌కుమార్.. స్టూడెంట్స్‌కు హిందీ పదాన్ని నేర్పించాలనుకుంటారు. కానీ పిల్లలు అది వినకుండా ‘రఘు తాత’ అని గోల చేస్తారు. అప్పట్లో ఈ సీన్ కోలీవుడ్ ప్రేక్షకులను తెగ నవ్వించగా.. ఇప్పుడు దానిని ఆధారంగా ఏకంగా ఒక సినిమా కథే పుట్టుకొచ్చింది.






ఏకంగా నాలుగు సినిమాలు..
లేడీ ఓరియెంటెడ్ కథలకు సరిగ్గా సరిపోయే హీరోయిన్‌గా కీర్తి సురేశ్ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. కానీ ‘మహానటి’ తర్వాత తను చేసిన ఏ లేడీ ఓరియెంటెడ్ చిత్రం కూడా హిట్ అవ్వలేదు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కీర్తికి హిట్లు ఇస్తూ వచ్చాయి. తాజాగా నాని సరసన నటించిన ‘దసరా’ మూవీలో కీర్తి నటన.. మరోసారి ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా చేసింది. కానీ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా నటించిన ‘భోలా శంకర్’ మాత్రం డిజస్టర్ అయ్యింది. అలా ఒకే ఏడాదిలో ఒక క్లీన్ హిట్, ఒక ఫ్లాప్ చూసిన కీర్తి.. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అందులో ‘రఘు తాత’ కూడా ఒకటి. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుందని చెప్పిన మేకర్స్.. రిలీజ్ డేట్‌ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.


Also Read: పొరపాటున బాయ్‌ఫ్రెండ్ పేరును బయటపెట్టేసిన జాన్వీ - ఆ మాజీ సీఎం కొడుకేనట!