Sandhya Theatre Incident: హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల భారీ నష్ట పరిహారం ప్రకటించారు. ప్రస్తుతం రేవతి కుమారుడు శ్రీతేజ్ సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, పుష్ప- 2 (Pushpa 2 Movie) నిర్మాత రవిశంకర్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి తండ్రి భాస్కర్‌ను అడిగి శ్రీతేజ్ పరిస్థితి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


శ్రీతేజ్ ఫ్యామిలీకి పుష్ప 2 టీమ్ ఎవరు ఎంత సాయం చేశారంటే..


అనంతరం టీమ్ మొత్తం కలిసి రూ.2 కోట్లు భారీ ఆర్థికసాయం ప్రకటించింది. హీరో అల్లు అర్జున్ తరపున రూ.1 కోటి, పుష్ప2 దర్శకుడు సుకుమార్, నిర్మాతలు చెరో రూ.50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను దిల్ రాజుకు అల్లు అరవింద్, పుష్ప 2 నిర్మాత అందించారు. శ్రీతేజ్ త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా మనముందు తిరుగుతాడని ఆశిస్తున్నానని అల్లు అరవింద్ అన్నారు.




అనుకోని విపత్తు జరిగింది, శ్రీతేజ్ కోలుకుంటున్నాడు..


ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవి శంకర్‌లతో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. ఇటీవల అనుకోని విపత్తు జరిగింది. ప్రస్తుతం బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. మొన్నటివరకూ వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఇప్పుడు బాలుడి ఆరోగ్యం కొంచెం మెరుగైంది. లీగల్ కారణాలతో ఆ కుటుంబాన్ని కలవలేకపోతున్నాం. అనుమతులు తీసుకుని శ్రీతేజ్ ను పరామర్శించా. త్వరలోనే బాలుడు కోలుకుని ఆరోగ్యంగా తిరుగుతాడు. ఎంతో నష్టపోయిన ఆ కుటుంబానికి అండగా నిలవాలని పుష్ప 2 టీమ్ భావించింది. అల్లు అర్జున్ తరఫున రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. పుష్ప 2 దర్శకుడు, నిర్మాతలు చెరో రూ.50 లక్షలు అందించారు’ అని దిల్ రాజుకు సంబంధిత చెక్కును అల్లు అరవింద్ అందించారు. అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు.


గురువారం సీఎం రేవంత్ ను కలవనున్న సినీ ప్రముఖులు
దిల్ రాజు వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు కలుస్తారని ఇటీవల చెప్పారు. దిల్ రాజు వచ్చిన తరువాత మొదట కిమ్స్ కు వెల్లి శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ప్రైవేట్ ఉద్యోగి. ఆయనకు ఇష్టమైతే సినిమా విభాగం (ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్)లో ఏదైనా ఉద్యోగం ఇస్తాం. వారి కుటుంబానికి ఆర్థికంగా సాయం అందించి, అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని జరిగిన దానిపై చర్చిస్తామని దిల్ రాజ్ ఇదివరకే చెప్పారు. గురువారం నాడు ఉదయం 10 గంటలకు కొందరు హీరోలు, దర్శకులు, నిర్మాతల బృందం వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానుంది. దీనిపై అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. 


Also Read: Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు