Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలోనే తెలుగుతో పాటుగా, మిగతాసౌత్ భాషల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో బన్నీ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ తాజాగా ఓ సెన్సేషనల్ రికార్డును క్రియేట్‌ చేశారు.


ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఇన్స్టాలో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 25 మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పటికీ గ్రేట్ ఫుల్ గా ఉంటానని పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఓ ఫోటోని షేర్ చేశారు. ఇది చూసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.






అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకోవడంతో, ఈ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డులకెక్కారు. బన్నీ తర్వాత విజయ్ దేవరకొండ (21.3 M), రామ్ చరణ్ (20.8 M), దుల్కర్ సల్మాన్ (14.1 M), యశ్ (13.5 М), మహేష్ బాబు (13.4 M), ప్రభాస్ (11.7M), విజయ్ (10.8 M) ఈ జాబితాలో ఉన్నారు. ఇక ట్విట్టర్ 'ఎక్స్' లో అల్లు అర్జున్‌కు 8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా.. ఫేస్ బుక్ లో 21 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.


బన్నీ ఎప్పటికప్పుడు తన సినిమా సంగతులతో పాటుగా వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ప్రత్యేక సందర్భాల్లో పోస్టులు పెట్టడమే కాదు, సినీ సెలబ్రెటీల పుట్టినరోజులకు శుభాకాంక్షలు చెబుతుంటారు. అలానే ఇతర హీరోలు నటించే మూవీ ప్రమోషనల్ కంటెంట్ ను లాంచ్ చేస్తూ, సినిమా నచ్చితే తన అభిప్రాయాన్ని ఇంటర్నెట్ లో పంచుకుంటూ వస్తున్నారు. 'పుష్ప' చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ సాధించిన తర్వాత, అల్లు అర్జున్ ఫాలోయింగ్, క్రేజ్ ఇంకా పెరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో భారీ స్థాయిలో ఫాలోవర్స్ ని అందుకున్న తొలి దక్షిణాది నటుడుగా రికార్డు సొంతం చేసుకున్నారని చెప్పాలి.


ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప: ది రూల్' చిత్రంలో నటిస్తున్నారు. ఇది బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'పుష్ప: ది రైజ్' సినిమాకి రెండో భాగంగా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'పుష్ప 2' సినిమా.. 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో అల్లు అర్జున్ - ఇదంతా 'పుష్ప 2' కోసమేనా?