Allu Arjun In NATS 2025: అమెరికా వేదికగా జరిగిన 'నాట్స్ 2025' ఈవెంట్‌లో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు సందడి చేశారు. తెలుగు వారు ఎక్కడున్నా ఏ రంగంలోనైనా 'తగ్గేదేలే' అంటూ తనదైన డైలాగ్‌తో ప్రశంసించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయనతో పాటు డైరెక్టర్ సుకుమార్, బ్యూటీ శ్రీలీల, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమెరికాలో బన్నీకి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన... 'తెలుగువారంటే ఫైర్ అనుకున్నారా... వైల్డ్ ఫైర్.' అంటూ 'పుష్ప' స్టైల్‌లో డైలాగ్ చెప్పారు. విదేశాల్లోనూ తెలుగు వారు అన్నీ రంగాల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు. 

నాట్స్... ఇంటర్నేషనల్ అంతే

అమెరికాలో తెలుగు వారంతా ఇలా కలవడం ఎంతో సంతోషంగా ఉందని బన్నీ అన్నారు. 'ఈ కార్యక్రమంలో ఎప్పుడు పాల్గొన్నా ఎంతో ఆశ్చర్యానికి గురవుతుంటా. ఇంతమంది తెలుగు వారిని చూస్తుంటే హైదరాబాద్, విశాఖలో ఉన్నట్లుగా ఉంది. నన్ను ఇలాంటి అద్భుత ఈవెంట్‌కు ఆహ్వానించినందుకు నాట్స్‌కు ధన్యవాదాలు. పుష్ప స్టైల్‌లో చెప్పాలంటే... 'నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేషనల్.' మన తెలుగు కల్చర్‌ను భవిష్యత్ తరాలకు తీసుకెళ్తున్నందుకు ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మన తెలుగోళ్లు ఎక్కడున్నా తగ్గేదేలే.' అని చెప్పారు.

Also Read: 'లక్కీ భాస్కర్' సీక్వెల్ కన్ఫర్మ్ - ఆ మూవీస్ ఇష్టం లేదన్న డైరెక్టర్ వెంకీ అట్లూరి

సుకుమార్‌కు నాకూ అదే పోలిక

తాను పరిచయం చేసిన అల్లు అర్జున్, శ్రీలీల స్టార్స్‌గా 'నాట్స్ 2025' వేదికపై ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. డైరెక్టర్ సుకుమార్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఆయనకు, తనకూ ఓ పోలిక ఉందని అది గడ్డమని నవ్వులు పూయించారు. 'నేను 'అడవి రాముడు' సినిమాలో అడవిని నమ్ముకున్నా. స్టార్ డైరెక్టర్ అయ్యా. నువ్వు 'పుష్ప' సినిమాలో అడవిని నమ్ముకున్నావు. స్టార్ డైరెక్టర్‌వి అయ్యావు. బన్నీ స్టార్ హీరోగా చేశావ్. శ్రీలీల కూడా 'దెబ్బలు పడతాయి' అంటూ అందరినీ అలరిస్తోంది.' అని అన్నారు.

వారికి రుణపడి ఉన్నా

అమెరికాలో తెలుగు వారందరికీ తానెంతో రుణపడి ఉన్నట్లు డైరెక్టర్ సుకుమార్ తెలిపారు. 'ముఖ్యంగా '1 నేనొక్కడినే' చిత్రాన్ని ఇక్కడి తెలుగు వారంతా ఆదరించడంతోనే నాకు వేరే మూవీ ఛాన్స్ వచ్చింది. అది నా కెరీర్‌కు ఎంతో ప్లస్ అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి నవీన్‌ను నిర్మాతగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ సంస్థ ఎన్నో సినిమాలు తెరకెక్కించి ఎంతో మందికి ఉపాధి కల్పించింది.' అంటూ సుకుమార్ తెలిపారు.

ఒకే ఫ్రేమ్‌లో...

ఈ సందర్భంగా ఒకే ఫ్రేమ్‌లో బన్నీ, సుకుమార్, శ్రీలీల సందడి చేశారు. ముగ్గురూ కలిసి సెల్ఫీ దిగారు. 'పుష్ప 2'... 'కిస్ కిస్ కిస్సిక్' అంటూ స్పెషల్ సాంగ్‌తో అలరించారు శ్రీలీల. ఈ ఐకానిక్ పిక్ వైరల్ అవుతోంది.