Tollywood Movies Releasing This Week: ఆదిత్య 369 రీ రిలీజ్... బాలయ్య సినిమాతో థియేటర్లలోకి వస్తున్న కొత్త సినిమాలు ఏమిటంటే?
Upcoming Telugu Movies 2025: మార్చి చివరి వారంలో థియేటర్లలోకి నాలుగు సినిమాలు వచ్చాయి. మరి ఏప్రిల్ మొదటి వారంలో వచ్చే సినిమాలేమిటి? ఒక లుక్ వేయండి.

'మ్యాడ్ స్క్వేర్' థియేటర్లలో నవ్వుల పండుగ తీసుకొచ్చింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. నితిన్, శ్రీ లీల జంటగా నటించిన 'రాబిన్ హుడ్' ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. డబ్బింగ్ సినిమాలు 'ఎల్ 2 ఎంపురాన్', 'వీర ధీర శూర పార్ట్ 2' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మార్చి ఆఖరి వారంలో నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి, ఏప్రిల్ మొదటి వారంలో వస్తున్న సినిమాలు ఏమిటి? అనేది చూస్తే....
బాలకృష్ణ 'ఆదిత్య 369' రీ రిలీజ్!
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ సినిమా 'ఆదిత్య 369'. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ సంస్థ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ సతీమణి అనిత కృష్ణ నిర్మించిన చిత్రమిది. మన దేశంలో మొదటి టైం ట్రావెల్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు సైతం అప్పట్లో అందుకున్న చిత్రం ఇది. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాను ఏప్రిల్ 4న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాలలో భారీ చిత్రం ఇది. ప్రేక్షకులు అందరిలో క్రేజ్ ఉన్న సినిమా కూడా ఇదే.
'శారీ'తో రాంగోపాల్ వర్మ సెన్సేషన్!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఆయన అందించిన కథతో గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించిన సినిమా 'శారీ'. ఇందులో సోషల్ మీడియా సెన్సేషన్ మలయాళ భామ ఆరాధ్య దేవి ప్రధాన పాత్ర పోషించారు. సత్య యాదు హీరోగా నటించారు. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ చిత్రం ఇది. ఏప్రిల్ 4 న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషలలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు వర్మ శైలిలో ఉన్నాయి. ఆరాధ్య దేవి, రామ్ గోపాల్ వర్మ కాంబో ఈ సినిమాకు కావలసిన ప్రచారాన్ని తీసుకొస్తుంది. సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Also Read: సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
నటుడిగా ఎస్పీబీ చరణ్ రీఎంట్రీ కూడా!
ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడిగా చిత్రసీమలోకి ప్రవేశించినా... గాయకుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్పీబీ చరణ్. గతంలో హీరోగా, నటుడిగా ఆయన సినిమాలు చేశారు. చాలా ఏళ్ళ విరమణ తర్వాత 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్) సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ సంస్థలపై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాణంలో పవన్ కేతరాజు దర్శకత్వం వహించిన చిత్రమిది. శ్రీ హర్ష, కషిక కపూర్ జంటగా నటించారు. ఏప్రిల్ 4 న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది.
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'జాక్', అలాగే అజిత్ హీరోగా నటించిన 'గుడ్ బాడ్ అగ్లీ', హిందీ హీరో సన్నీ డియోల్ - తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన 'జాట్' సినిమాలు ఏప్రిల్ 10న విడుదలకు రెడీ అయ్యాయి. అందుకని ఈవారం తక్కువ సినిమాలు వస్తున్నాయి.