శ్రీరామచంద్రుడి పాత్రలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన చిత్రం 'ఆదిపురుష్' (Adipurush Movie ). దీనికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్ జోడీగా, జానకి అలియాస్ సీత దేవిగా కృతి సనన్ నటించారు. జూన్ 16న సినిమా విడుదల కానుంది. వచ్చే వారమే ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ చూసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
Adipurush Trailer : మే 9న 'ఆదిపురుష్' ట్రైలర్ విడుదల కానుంది. దేశవ్యాప్తంగా కొన్ని థియేటర్లలో త్రీడీలో ట్రైలర్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ ట్రైలర్ ముఖ్యమంత్రుల వద్దకు కూడా చేరుతోంది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Shivraj Singh Chauhan)ను చిత్ర నిర్మాతలలో ఒకరైన భూషణ్ కుమార్ కలిశారు. సీయంకు సినిమా ట్రైలర్ చూపించారు.
''ఆదిపురుష్' ట్రైలర్ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పురాణగాథకు దర్శక నిర్మాతలు ప్రాణం పోశారు'' అని శివరాజ్ సింగ్ చౌహన్ పేర్కొన్నారు. అంతే కాదు... ఈ సందర్భంగా సమాజంలోని పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమాలు ఉంటాయని ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Also Read : 'ఏజెంట్' రిజల్ట్ మీద నాగచైతన్య రియాక్షన్ - 'కస్టడీ' డిజప్పాయింట్ చేయదు!
'ఆదిపురుష్' నుంచి ఇప్పటికి రెండు పాటల టీజర్స్ విడుదల చేశారు. అక్షయ తృతీయ సందర్భంగా ప్రభాస్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. అలాగే, 'జైశ్రీరాం, నీపై నమ్మకమే మా బలం' సాంగ్ టీజర్ విడుదల చేశారు. సీతా నవమి సందర్భంగా ఏప్రిల్ 29న శ్రీరాముని పత్ని జానకిగా నటించిన కృతి సనన్ స్టిల్స్ విడుదల చేశారు. అవి చూస్తే... సీత కళ్ళల్లో చెమ్మ స్పష్టంగా కనబడుతోంది. శ్రీరాముని తలపులో సీత ఆలోచనల్లో పడిన సందర్భంలో స్టిల్ ఏమో!? ఇంకా 'రామ్ సియా రామ్' (Ram Siya Ram) సాంగ్ ఆడియో టీజర్ కూడా విడుదల చేశారు.
Also Read : డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!
ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు. హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్లలో ఒకటైన యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రమిది.
ఐదు భాషల్లో సినిమా విడుదల!
తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ... మొత్తం ఐదు భాషల్లో 'ఆదిపురుష్' కోసం సంగీత దర్శక ద్వయం అజయ్ - అతుల్ స్వరపరిచిన 'జై శ్రీరాం' సాంగ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. సినిమాను సైతం ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ట్రిబెకా చిత్రోత్సవాల్లో 'ఆదిపురుష్'
ప్రతిష్టాత్మక ట్రిబెకా ఫెస్టివల్ (Tribeca Film Festival 2023)లో ప్రదర్శనకు 'ఆదిపురుష్' ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ 7 నుంచి 18వ తేదీ వరకు చిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. అందులో జూన్ 13వ తేదీన 'ఆదిపురుష్' ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేశారు.