ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. తొలి రోజు షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ఢిల్లీ, ముంబై సహా పలు మెట్రో నగరాల్లో ఈ సినిమా టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ. 2 వేలకు అమ్ముడవుతోంది. ధర ఎంతైనా ప్రేక్షకులు తగ్గేదే లేదంటున్నారు. కచ్చితంగా సినిమా చూసే తీరాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
ఆయా నివేదికల ప్రకారం ‘ఆదిపురుష్’ టికెట్ల ధరలు
ఆయా నివేదికల ప్రకారం.. కొన్ని థియేటర్లు తొలి రోజు షోలకు గాను ఒక్కో టికెట్ ధర రూ. 2000 వరకు అమ్ముతున్నాయి. ఢిల్లీలోని PVRలో: వేగాస్ LUXE, ద్వారక, PVR సెలెక్ట్ సిటీ వాక్ (గోల్డ్)లో ఇప్పటికే ₹1800 టికెట్లు, ₹2000 టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. నోయిడాలోని PVR గోల్డ్ లాజిక్స్ సిటీ సెంటర్‌లో ₹1650 టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. PVR గోల్డ్ లాజిక్స్ సిటీ సెంటర్‌లో ఫ్లాష్ టిక్కెట్‌లు ₹1150కు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొన్ని థియేటర్లలో ఒక్కో టికెట్ ధర దాదాపు ₹250కి కూడా అందుబాటులో ఉన్నాయి. ముంబైలో, Maison PVR: లివింగ్ రూమ్, లక్స్, Jio వరల్డ్ డ్రైవ్, BKCలో అన్ని షోలకు టిక్కెట్‌లు ₹2000కి అమ్ముడవుతున్నాయి. కోల్‌కతా, బెంగుళూరులోనూ ఇదే ధర పలుకుతోంది. అయితే చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం టిక్కెట్లు చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి.
ఉచితంగా టిక్కెట్లు అందిస్తున్న సెలబ్రిటీలు
ఇటీవల, రణబీర్ నిరుపేద పిల్లల కోసం 10,000 ఆదిపురుష్ టిక్కెట్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని సినీ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. "రణబీర్ కపూర్ నిరుపేద పిల్లల కోసం 10,000 'ఆదిపురుష్' టిక్కెట్లను బుక్ చేయనున్నారు" అని వెల్లడించారు. ఆ తర్వాత టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10,000 ‘ఆదిపురుష్’ టిక్కెట్లను ఉచితంగా పలువురికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ టికెట్లను తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలోని వారికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
రామాయణం ఇతిహాసం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రెట్రో ఫైల్స్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందించారు. కాగా ఇప్పటికే నార్త్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. కేవలం నార్త్ లోనే సుమారు రూ.2 కోట్ల రూపాయల గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: ఇటలీలో లవ్ బర్డ్స్ వరుణ్, లావణ్య - ఎంగేజ్మెంట్‌కు ముందే షికారు? ఇవిగో ఆధారాలు!