తెలుగు సినిమా పరిశ్రమలో చాలా కాలం పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగారు పద్మ జయంతి. ఎన్నో చిత్రాల్లో భార్యగా, తల్లిగా, సోదరిగా నటించి మెప్పించారు. సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల నుంచి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నా, ఆర్థికంగా పెద్దగా ఎదిగిందేమీ లేదని వెల్లడించారు. అంతేకాదు, సాయం కోసం వెళ్లితన తనకు మా అసోసియేషన్ నుంచి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.


ఆర్థిక సాయం కోసం ఎన్నో అవమానాలు


తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడిన పద్మ.. ఒకప్పుడు మా ప్రెసిడెంట్ గా ఉన్న నరేష్, జనరల్ సెక్రెటరీగా ఉన్న జీవిత తనను ఎలా ఇబ్బంది పెట్టారో వెల్లడించే ప్రయత్నం చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల్లో నిలబడిన వారు ఎన్నో మాటలు చెప్తారని, వాటిని నెరవేర్చడంలో మాత్రం చిత్తశుద్ధి ఉండదని ఆమె ఆరోపించారు. నరేష్ మా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ‘కల్యాణ లక్ష్మి’ అనే పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. నిరుపేద ఆర్టిస్టుల పిల్లల పెళ్లిళ్లకు ఈ పథకం కింద సాయం చేస్తామని చెప్పారు. అందరి లాగే తన కూతురు పెళ్లి కోసం సాయం చేయాలని మా అసోసియేషన్ ను కోరినట్లు పద్మ తెలిపింది. అయితే, రూ. లక్ష కోసం తనకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని చెప్పారు.


నరేష్, జీవిత నాతో ఆడుకున్నారు- పద్మ


వాస్తవానికి నాటి మా ప్రెసిడెంట్ నరేష్ కు, జనరల్ సెక్రెటరీ జీవిత రాజశేఖర్ కు అస్సలు పడేది కాదని పద్మ తెలిపారు. వారి ఇద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా తాను ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. తను ఇచ్చే ఆర్థికసాయం క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు ఇద్దరు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. పెళ్లికి వారం రోజుల సమయం ఉన్నా, ఇంకా ఆర్థిక సాయం విషయం ఎటూ తేల్చక మానసిక క్షోభకు గురి చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


కృష్ణం రాజు స్పాన్సర్ షిప్ తో ఆర్థికసాయం


చివరకు దివంగత సీనియర్ నటుడు కృష్ణం రాజు స్పాన్సర్ షిప్ తో  తన బిడ్డ పెళ్లికి రూ. లక్ష అందించారని పద్మ తెలిపారు. లక్ష రూపాయలు ఇచ్చి, కోటి రూపాయలు ఇచ్చినట్లుగా కొంత మంది మా సభ్యులు ప్రవర్తించారని ఆమె విమర్శించారు. మరికొంత మంది అయితే, ఈ లక్ష రూపాయలు ఇచ్చుడే ఎక్కువ అంటూ అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మా పదవుల్లో ఉన్న మహిళలు కూడా సాటి మహిళ అనే సానుభూతి కూడా చూపించలేదని చెప్పారు. ఇండస్ట్రీలోనే కాదు, మా అసోసియేషన్ లోనూ చాలా మంది చెప్పే మాటలకు, చేసే పనులకు చాలా తేడా ఉంటుందని పద్మ తెలిపారు. వారి మాటలు నమ్మితే నట్టేట ముంచడం ఖాయం అని చెప్పారు. తనకు ఎదురైన ఘటనలే అందుకు ప్రత్యక్ష ఉదాహారణలని పద్మ తెలిపారు.


Read Also: సెకెండ్ మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే?- అసలు విషయం చెప్పిన రేణు దేశాయ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial