Chandini Chowdary: షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని సినీ ఇండస్త్రీలో అడుగుపెట్టిన నటీనటులలో టాలీవుడ్ హీరోయిన్ చాందినీ చౌదరి, యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాల్లోకి రాకముందు వీరిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. యూట్యూబ్ లో వచ్చిన 'ట్రూ లవ్', 'ది బ్లైండ్ డేట్', 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్', 'అప్రోచ్', 'ప్రపోజల్', 'సాంబార్ ఇడ్లీ' లాంటి షార్ట్ ఫిలిమ్స్ వీరికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే స్మాల్ స్క్రీన్ ను పంచుకున్న ఈ జంట, బిగ్ స్క్రీన్ మీద ఇంతవరకూ కలిసి నటించలేదు. ఇదే విషయంపై లేటెస్టుగా చాందిని ఓ ఇంటర్వ్యూలో స్పదించింది. రాజ్ తరుణ్ తో కలిసి సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను తెలిపింది. 


‘‘రాజ్ తరుణ్‌తో చాలా హిట్ షార్ట్ ఫిలిమ్స్ చేశారు కదా, అవకాశం వస్తే బిగ్ స్క్రీన్ మీద కలిసి నటించాలని ఎప్పుడూ అనుకోలేదా?’’ అని యాంకర్ ప్రశ్నించగా.. "అయ్యో, కలిసి చేయడానికి మాకు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలు నేను చెయ్యలేకపోయాను'' అని చాందిని చౌదరి బదులిచ్చింది. ఆయన హీరోగా నటించిన మొదటి మూడు చిత్రాల్లో హీరోయిన్ అవకాశాలు ముందుగా నాకే వచ్చాయి. దురదృష్టవశాత్తు నేను వాటిల్లో నటించలేకపోయాను. అప్పటి నుంచి ఇద్దరం వేర్వేరు దారుల్లో సినిమాలు చేసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత కలిసి నటించడానికి అవకాశం రాలేదు. అయినా మేమిద్దరం ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాం అని చాందినీ చెప్పుకొచ్చింది. 


ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌లో పుట్టిపెరిగిన తెలుగమ్మాయి చాందినీ చౌదరి.. బెంగుళూరులో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించింది. 2015లో 'కేటుగాడు' అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. అనంతరం 'బ్రహ్మోత్సవం', 'లై' చిత్రాల్లో క్యామియో అప్పీరియన్స్ ఇచ్చిన అమ్మడు.. 'కుందనపు బొమ్మ' 'హౌరా బ్రిడ్జ్' 'మను' వంటి మూవీస్ లో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో చాందినీ అంతగా ఫోకస్ అవలేదు. అందం అభినయం ఉన్నప్పటికీ పెద్దగా లక్ కలిసి రాలేదు. అలాంటి టైంలో వచ్చిన 'కలర్ ఫోటో' చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 


సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కలర్ ఫోటో' సినిమాలో సుహాస్ కి జోడిగా నటించింది చాందినీ చౌదరి. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కడంతో ఆమెకు హీరోయిన్ గా వరుస అవకాశాలు వచ్చాయి. ఇందులో భాగంగానే 'బొంబాట్', 'సూపర్ ఓవర్', 'సమ్మతమే' వంటి చిత్రాలతో అలరించింది. ఈ క్రమంలోనే 'సభా నాయగన్' అనే తమిళ మూవీతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇటీవల 'గామి' సినిమాతో మంచి విజయం అందుకుంది. 


సినిమాల్లోనే కాకుండా ఓటీటీ కంటెంట్ లోనూ మెరిసింది చాందినీ. 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి', 'మస్తీస్', 'షిట్ హాపెన్స్', 'అన్ హర్డ్' 'గాలివాన' 'ఝాన్సీ' వంటి వెబ్ సిరీస్ లలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. చాందిని చౌదరి పోలీసాఫీసర్ పాత్ర పోషించిన 'యేవమ్' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో వశిష్ట సింహా, భరత్‌ రాజ్, ఆషు రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవదీప్, పవన్‌ గోపరాజు నిర్మించారు. దీంతో పాటుగా 'మ్యూజిక్ షాప్ మూర్తి', 'సంతాన ప్రాప్తిరస్తు' వంటి సినిమాల్లో చాందిని లీడ్ రోల్స్ చేస్తోంది.


Also Read: రాజమౌళికి మొదటి అవకాశం ఇచ్చింది రామోజీరావే అని తెలుసా?