తెలుగులో ‘నువ్వే కావాలి’ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సాయి కిరణ్. అందులో ‘‘అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది’’ అంటూ సాగే పాటలో సింగర్ గా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. తర్వాత ఆయన ‘ప్రేమించు’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించారు. కెరీర్ ప్రారంభంలో ‘శివ లీలలు’ సీరియల్ లో నటించిన ఆయన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో ఒకటి, రెండు సినిమాలు పర్వాలేదనిపించినా తర్వాత సరైన స్క్రిప్ట్ లను ఎంచుకోలేకపోవడం వలన సినిమాల్లో అంతగా రానించలేకపోయారు. కొన్నాళ్లకు మళ్లీ సాయి కిరణ్ బుల్లితెరవైపు వెళ్లారు. ప్రస్తుతం పలు సీరియల్ లలో నటిస్తున్నారు. సాయి కిరణ్ కేవలం నటుడిగానే కాకుండా పాముల సంరక్షణ టీమ్ లో పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడైనా పాములు ఉన్నాయని కంప్లైట్ వస్తే వెంటనే వెళ్లి వాటిని రెస్క్యూ చేసి మళ్లీ జాగ్రత్తగా అడవుల్లో వదిలిపెడతారు. సినీ ఇండస్ట్రీలోనే పలువురు ప్రముఖుల నివాసాల్లో పాములను రెస్క్యూ చేశారు సాయి కిరణ్.
స్వతహాగా శివభక్తుడైన సాయి కిరణ్ కు పాములను చంపడం ముందు నుంచి నచ్చేది కాదు. అందుకే ఎక్కడైనా జనావాసాల్లో పాములు కనిపిస్తే వాటిని ఆయనే స్వయంగా పట్టుకుని అడవుల్లో వదిలేసేవారు. తర్వాత పాములను రక్షించే టీం లో చేరి శిక్షణ తీసుకున్నారు. అలా దాదాపు 3000 వేలకు పైగానే పాములను రెస్క్యూ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలన్నీ చెప్పారు. ఓసారి అనుకోకుండా పాము కరిచిందని, అపుడు చనిపోతానని భయం వేసిందని అన్నారు. అయినా పాములను పట్టుకోవడం మానలేదని అన్నారు. సినిమా ఇండస్ట్రీలోనే చాలా మంది ప్రముఖుల ఇండ్లలో పాములను పట్టానని అన్నారు సాయికిరణ్. చిరంజీవి ఇంట్లో తరచూ పాములు స్విమ్మింగ్ పూల్ లోకి వచ్చి పడేవని అన్నారు. తాను వెళ్లి రిస్క్యూ చేసేవాడినని అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇంట్లోకి కూడా పాములు వచ్చేవని చెప్పారు. ఆ ఇంట్లో పాములు ఎలా వస్తున్నాయో తెలియక తనను సలహా అడిగారని, తాను వెళ్లి చూసి సలహా ఇచ్చానని తర్వాత పాములు రావడం తగ్గిపోయాయని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా పాములను పట్టామని చెప్పారు సాయి కిరణ్.
అలా పట్టిన పాములను శ్రీశైలం అడవుల్లో వదిలేసే వాళ్లమని చెప్పారు సాయి కిరణ్. ఓ సారి తాము పాములను వదలడానికి వెళ్లినపుడు ఓ గోను సంచి చిరిగిపోవడం వలన అందులో ఉన్న పాములన్నీ తన మీద పడ్డాయని అన్నారు. అప్పుడు తనకు చాలా భయం వేసిందన్నారు. అందులో ఉన్నవన్నీ నాగుపాముల కావడంతో ఒక్కటి కరచినా చనిపోతానని అనుకున్నానని అన్నారు. అప్పుడు ఏం చేయాలో తెలియక శివుణ్ని ప్రార్థించానని, ఒక్క పాము కరచినా మళ్లీ జీవితంలో పాములు పట్టను అని అనుకున్నానని, ఒక్క పాము కూడా తనను కరవలేదని చెప్పుకొచ్చారు. తండ్రి చనిపోయాక ఆయన తల్లి భయపడటంతో పాములు పట్టడం బాగా తగ్గించానని అన్నారు.
Read Also: యూట్యూబ్ నుంచి ‘భీడ్‘ ట్రైలర్ తొలగింపు, ప్రజాస్వామ్య హత్య అంటూ నెటిజన్ల ఆగ్రహం