Filmfare Awards: ఆ అవార్డులను వాష్ రూమ్ హ్యాండిల్‌గా వాడతా - ‘ఫిల్మ్‌ఫేర్’పై నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు
ఇటీవల బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Filmfare Awards: సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు వారి ప్రతిభకు గుర్తింపుగా అవార్డులు వస్తూ ఉంటాయి. అలా నటీనటులు ఎంతో గౌరవంగా భావించే అవార్డుల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా ఒకటి. అయితే ఇటీవల బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ ఫిల్మ్ ఫేర్ అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై సినీ ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీకు సంబంధించిన కొంత మంది నటులు కూడా స్పందించారు. ఫిల్మ్ ఫేర్ అవార్డులపై నసీరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అవార్డులను వాష్ రూమ్ హ్యాండిల్ గా ఉపయోగిస్తా: నసీరుద్దీన్ షా
ఇటీవల బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్ ఫేర్ అవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిల్మ్ ఫేర్ అవార్డులకు ఎలాంటి ప్రాధాన్యత లేదన్నారు. తన అవార్డులను వాష్ రూమ్ హ్యండిల్ కు వేలాడదీసానంటూ కామెంట్ చేశారు. ఒక నటుడికి కావాల్సింది అవార్డులు కాదని, ఒక క్యారెక్టర్ కోసం కష్టపడేవాడు గొప్ప నటుడు అవుతాడని అన్నారు. నటీనటుల్లో కొంత మందిని ఎంపిక చేసి వాళ్లే గొప్ప నటులు అని అవార్డులు ప్రకటించడం సరికాదన్నారు. అందుకే తనకు చివరిగా వచ్చిన రెండు అవార్డులను తాను తీసుకోలేదని చెప్పుకొచ్చారు. తనకొచ్చిన అవార్డులను చూసి తానెప్పుడు పొంగిపోలేదని చెప్పారు. ఒకవేళ తాను ఫ్యాలెస్ కట్టుకుంటే అందులో వాష్ రూమ్ హ్యాండిల్స్ గా ఈ అవార్డులను పెడతానని, అపుడు దాన్ని తాకిన అందరికీ అవార్డు వచ్చినట్టే కదా అని వ్యాఖ్యానించారు. తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మ అవార్డులు తీసుకున్నప్పుడే సంతోషంగా అనిపించింది అని అన్నారు.
నసీరుద్దీన్ షా పై ఫైర్ అవుతున్న పలువురు సెలబ్రెటీలు..
బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు. దాదాపు 40 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న ఆయన 72 ఏళ్ల వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. నటుడిగా ఎన్నో రాష్ట్ర, జాతీయ అవార్డులను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను కూడా అందుకున్నారు నసీరుద్దీన్. అలాంటి ఆయన అవార్డుల గురించి తక్కువ చేసి మాట్లాడటం సరికాదని కొందరు బాలీవుడ్ సెలబ్రెటీలు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయి నసీరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించారు. ఫిల్మ్ ఫేర్ అవార్డు తనకు చాలా గొప్పదని పేర్కొన్నారు. అది తన కల అని అన్నారు. ఫిల్మ్ ఫేర్ ను చూస్తూనే పెరిగానని, దాన్ని చూస్తే తనకు చాలా ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు మనోజ్. ఆ అవార్డు సాధించడం గొప్ప విషయమేనన్నారు. నసీరుద్దీన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నుంచి మరో నటుడు సుభాష్ ఘాయ్ కూడా స్పందించారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల పై నసీరుద్దీన్ వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేశారు సుభాష్. నటుడిగా మనకు ఏ అవార్డు వచ్చినా దాన్ని మనం గౌరవంగా స్వీకరించాలని, అవార్డులను అగౌరవపరచకూడదని అన్నారు. ఫిల్మ్ ఫేర్ అవార్డు అనేది ప్రతిష్టాత్మకమైనదని, ఆ అవార్డుకు ఎంపిక అవ్వడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. తాను కూడా పలు సార్లు అవార్డులకు నామినేట్ అయినా మూడు సార్లు మాత్రమే దక్కించుకోగలిగానని పేర్కొన్నారు. అందులో నామినేట్ అవ్వడం కూడా గెలుపు లాంటిదేనని వ్యాఖ్యానించారు. ఏదేమైనా నసీరుద్దీన్ వ్యాఖ్యలు మళ్లీ బాలీవుడ్ లో కొత్త చర్చకు దారితీసాయనే చెప్పాలి. ఇంకా దీనిపై ఎవరెవరు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Read Also : అవును, లావణ్యతో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారు - త్వరలో పెళ్లి, రేపే ఎంగేజ్మెంట్