Manchu Vishnu about Kannappa: గడచిన కొన్నేళ్లలో టాలీవుడ్‌లో మైథలాజికల్ సినిమాల హవా నడుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఎన్నో మైథలాజికల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లు అయ్యాయి. అదే తోవలోకి మంచు విష్ణు నిర్మిస్తూ.. నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం కూడా చేరుతుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ‘కన్నప్ప’ అనేది మైథలాజికల్ చిత్రం కాదని, అసలు ఆ సినిమా కథ ఏంటో, ఏ జోనర్‌కు చెందుతుందో చెప్పుకొచ్చాడు విష్ణు. ఈ కథ గురించి, దీని ప్రాముఖ్యత గురించి చెప్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను విడుదల చేశాడు. 


డిస్టర్బ్ చేసిన ప్రశ్న..
సంక్రాంతి రోజు ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు మంచు విష్ణు. వారి ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు అందించడం కోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌ను ఏర్పాటు చేశాడు. ఇక ఆ సమయంలో తనను బాగా డిస్టర్బ్ చేసిన ఒక ప్రశ్న గురించి చెప్తూ.. విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను విడుదల చేశాడు. ‘‘ఆ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా నడిచింది. చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఎదురయ్యాయి. మీ బైసెప్ సైజ్ ఎంత అని అడిగారు’’ అంటూ ఆరోజు జరిగిన యాస్క్ మీ ఎనీథింగ్ గురించి గుర్తుచేసుకున్నాడు విష్ణు. ‘‘ఇక జోకులు పక్కన పెడితే.. చాలామంది తమిళనాడు, కర్ణాటక, నార్త్‌కు చెందినవారు నన్ను ఒక ప్రశ్న అడిగారు. దానివల్ల నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. అది చాలా సింపుల్ ప్రశ్న - మీ మైథలాజికల్ మూవీ కన్నప్ప ఎప్పుడు రిలీజ్ అవుతుంది’’ అని ‘కన్నప్ప’ గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నను గుర్తుచేసుకుంటూ దానికి సమధానమిచ్చాడు విష్ణు.


రామాయణ, మహాభారతాలకు ఆధారాలు..
‘‘మైథలాజికల్ అనే పదానికి అర్థం ఏంటంటే దానికి చారిత్రిక ఆధారాలు లేకపోవడం. ఏదైనా నిజం కాకపోతే కల్పితం అయితే దానిని మైథలాజికల్ అంటారు’’ అని చెప్తూ.. రామాయణంలో ఉన్న రామసేతు బ్రిడ్జ్ నిజమే అంటూ నాసా ఇచ్చిన ప్రకటనను గుర్తుచేసుకున్నాడు మంచు విష్ణు. దాంతో పాటు మహాభారతంలోని ద్వారక ఉంది అనగానే అది ఎక్కడ ఉందో తెలుసుకున్నారని, వేల సంవత్సరాల క్రితం రాసిన మహాభారతంలో గోడలు ఎలా ఉన్నాయి, పిల్లర్స్ ఎలా ఉన్నాయని రాసారో.. ద్వారకలో అచ్చం అలాగే ఉన్నాయని ఆధారాలతో తీసుకొచ్చారని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇదంతా చెప్తూ.. మన కల్చర్‌ను ఎందుకు మనం నమ్మడం లేదని ప్రశ్నించాడు. 


శ్రీకాళహస్తి గుడి చరిత్ర..
‘‘మిగతావారంతా వాళ్ల కథలను నమ్ముకుంటారు, గర్వంగా చెప్పుకుంటారు. కన్నప్ప అనే కథ నిజం అని చెప్పడానికి నిదర్శనం శ్రీకాళహస్తి గుడి. పార్వతీ పరమేశ్వరులు ఆయన తల్లిదండ్రులను నేను నమ్ముతాను. ఆ గుడిలో వందల, వేల సంవత్సరాల నుండి స్వయంభు వాయులింగం ఉంది. ఆ లింగం గురించి కన్నప్పలో ఉంటుంది. ఇది మైథలాజికల్ మూవీ కాదు.. ఇది నిజమైన కథ. కన్నప్ప అనేది గొప్ప శివ భక్తుడి కథ. మిమ్మల్ని త్వరలోనే కన్నప్ప ప్రపంచానికి పరిచయం చేస్తా. చరిత్రను తెలుసుకోండి, జాగ్రత్తగా కాపాడుకోండి. మనమేంటో.. దానికి గర్వపడండి’’ అంటూ ‘కన్నప్ప’ కథ గురించి క్లారిటీ ఇచ్చాడు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. ఈ సినిమాతో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ కూడా చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయం అవుతున్నాడు.






Also Read: మొన్న అలా, ఈ రోజు ఇలా - రెస్టారెంట్‌లో పనిచేస్తూ కనిపించిన అవంతిక వందనపు, వీడియో వైరల్