చెన్నై బ్యూటీ త్రిష పెళ్లికి సంబంధించి ఓ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఓ నిర్మాత తో త్రిష పెళ్లి జరగబోతుందని ఆ వార్త సారాంశం. అయితే తాజాగా న్యూస్ పై ట్విట్టర్ వేదికగా త్రిష పరోక్షంగా రెస్పాండ్ అవుతూ ఇలాంటి వార్తలను సృష్టిస్తున్న వారికి ఓ రకంగా వార్నింగ్ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సుమారు 21 ఏళ్ళు అవుతున్నా త్రిష మాత్రం ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. నేటికీ తరగని అందంతో మెరిసిపోతున్న ఈ చెన్నై సోయగం ఇటీవల 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో కుందమై అనే పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
40 ఏళ్లు దాటాక కూడా హీరోయిన్గా ఇంకా సత్తా చాటుతూనే ఉంది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషలతో కలుపుకొని త్రిష చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిల్లో కోలీవుడ్ మోస్ట్ అవైటెడ్ లోకేష్ కనకరాజు తలపతి విజయ్ 'లియో' సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఓ పక్క తన సినీ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయి. గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్మెంట్ జరిగి ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు త్రిష పెళ్లి వార్తలు కోలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే త్రిష ఓ మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం ఊపందుకుంది.
గతంలో ఆ నిర్మాత చేసిన ఓ సినిమాలో త్రిష నటించిందని, ఆ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే అతనితో త్రిష ఏడడుగులు వేయబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఈ ఏడాదే జరగబోతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా త్రిష ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా త్రిష స్పందిస్తూ.. "డియర్, మీరు.. మీ బృందం ఎవరో మీకు తెలుసు.. ప్రశాంతంగా ఉండండి అలాగే పుకార్లు ఆపండి" అని చెబుతూనే చివరికి 'చీర్స్' అని ట్విట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఒక రకంగా త్రిష ఇలాంటి పుకార్లు సృష్టించిన వారికి వార్నింగ్ ఇచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎందుకంటే త్రిష చెప్పిన దాని ప్రకారం ఎవరు అలాంటి పుకార్లు సృష్టిస్తున్నారో తనకు తెలుసని, అందుకే వాళ్లకు తగిలేలా వార్నింగ్ ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం త్రిష చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సినిమాల్లో 'లియో' దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దళపతి విజయ్ తో చాలా సంవత్సరాల తర్వాత త్రిష నటిస్తుండడంతో వీరిద్దరి జోడిని వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.
Also Read : నితిన్ 'తమ్ముడు'లో బెంగళూరు బ్యూటీ - 'కాంతార' భామ కాకుండా మరో అమ్మాయి!