Netizens Reaction On Abhishek Bachchan Latest Post: బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ పెట్టిన ఓ పోస్ట్ అటు సోషల్ మీడియా.. ఇటు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాను అన్నింటి నుంచీ కొన్ని రోజులు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు బుధవారం రాత్రి పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. 

ఒకే ఒక్క పోస్ట్.. అనేక అనుమానాలు

ఎప్పుడో ఒకప్పుడు సోషల్ మీడియాలో కనిపించే అభిషేక్ తాజాగా చేసిన ఇన్ స్టా పోస్ట్ చర్చకు దారి తీసింది. 'కొన్ని రోజులు నేను అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఉన్నదంతా నాకు ఎంతో ఇష్టమైన వారికి ఇచ్చేశాను. ఇప్పుడు నా కోసం టైం కేటాయించుకోవాలనిపిస్తుంది. నా గురించి నేను తెలుసుకునేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. అంతే కాకుండా.. 'కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే అందరికీ దూరంగా ఉండాలి.' అంటూ ఈ పోస్ట్‌కు కామెంట్ పెట్టారు.

Also Read: నేనూ బ్రాహ్మణుడినే - సినిమా చూసి మాట్లాడండి.. 'కన్నప్ప' వివాదంపై డైలాగ్ రైటర్ ఆకెళ్ల క్లారిటీ

సోషల్ మీడియాలో చర్చ

సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని అభిషేక్ బచ్చన్ అలా ఎందుకు పోస్ట్ చేశారంటూ నెట్టింట చర్చ సాగుతోంది. పలువురు నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'మీరు కొన్ని రోజులు నటనకు విరామం తీసుకుంటున్నారా?' అని అడగ్గా.. 'త్వరలోనే కొత్త అభిషేక్‌ను చూస్తాం' అంటూ కామెంట్ చేశారు. కొందరు అభిషేక్ చెప్పింది నిజమే అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. కొందరు 'సార్ మీ భార్య పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయండి' అంటూ సలహాలు ఇస్తున్నారు.

17 ఏళ్ల క్రితం అభిషేక్, ఐశ్వర్యల వివాహం జరగ్గా.. వీరి కుమార్తె ఆరాధ్య. ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా రూమర్స్ హల్చల్ చేశాయి. ఆ వార్తల్లో నిజం లేదంటూ ఇప్పటికే ఇద్దరూ పరోక్షంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఆ ప్రచారం ఆగలేదు. దీంతో స్వయంగా ఐశ్వర్యా  రాయ్ ఇటీవల అభిషేక్, ఆరాధ్యలతో కూడిన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేయగా.. వాటికి చెక్ పెట్టినట్లయింది. ఇప్పుడు తాజాగా అభిషేక్ ఇలా పోస్ట్ చేయడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే.. దానికి దీనికి సంబంధం లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. అభిషేక్ ఇటీవల 'హౌస్ ఫుల్ 5' మూవీతో మంచి విజయం అందుకున్నారు. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో రితేశ్ దేశ్ ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ ప్రధాన పాత్రలో నటించిన 'కాళీధర్ లాపతా' మూవీ డైరెక్ట్‌గా జులై 4న 'జీ5'లో స్ట్రీమింగ్ కానుంది.