Aakanksha singh About Shashtipoorthi Movie: నట కిరీటి రాజేంద్రప్రసాద్, సీనియర్ హీరోయిన్ అర్చన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'షష్టి పూర్తి'. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా రూపేష్, ఆకాంక్ష సింగ్ నటించగా.. పవన్ ప్రభ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
అచ్చమైన తెలుగమ్మాయిలా..
ఈ మూవీలో తాను అచ్చమైన తెలుగమ్మాయిలా.. 'జానకి' రోల్‌లో కనిపిస్తానని ఆకాంక్ష తెలిపారు. 'కరోనా వల్ల సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఓ మంచి కథతో మీ ముందుకు వస్తున్నా. ఇళయరాజ గారి సంగీతం సినిమాకే హైలెట్. టెక్నికల్ హై స్టాండర్స్డ్స్‌లో ఉంటాయి. సినిమాలో నేను టెంపుల్ ట్రెజరర్‌గా కనిపిస్తాను. ఇప్పుడు ఇలాంటి కథలు అవసరం. గోదావరి అందాల్ని మరింత అందంగా చూపించారు.' అని చెప్పారు.
గ్లిజరిన్ లేకుండానే ఎమోషన్ సీన్స్
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారితో పని చేయడం వల్ల తాను ఎంతో నేర్చుకున్నానని ఆకాంక్ష తెలిపారు. 'బెంచ్ లైఫ్ మూవీ తర్వాత ఈ మూవీలో ఆయనతో కలిసి నటిస్తున్నాను. మేం ఇద్దరం ఎప్పుడు కలిసి నటించినా గ్లిజరిన్ వాడలేదు. సహజంగానే ఎమోషనల్ సీన్స్‌ను రక్తి కట్టించేవాళ్లం. ‘షష్టి పూర్తి’ కోసం పని చేస్తుంటే నాకు యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లినట్టుగా అనిపించింది. ఇందులో నేను కేవలం రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో కనిపించను. నా కారెక్టర్‌లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడే చెప్పలేను.' అని అన్నారు.
Also Read: జయం రవి విడాకుల కేసు - రూ.40 లక్షల భరణం కోరుతూ ఆర్తి రవి పిటిషన్
మ్యూజిక్ అందరినీ కదిలిస్తుంది
'షష్టి పూర్తి' పాటలు, మ్యూజిక్ అందరినీ కదిలిస్తాయని ఆకాంక్ష తెలిపారు. 'ప్రతీ పాటకు ఓ ఎమోషన్ ఉంటుంది. ఇళయరాజా గారి పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడాలి. షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి నాకు గుర్తుకువచ్చారు. నేను ఆయన్ను చాలా మిస్ అయ్యాను. తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడపండి.. వారిని ప్రేమించండి. మా నిర్మాత రూపేష్ చాలా మంచి వ్యక్తి. మూవీస్ పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఈ చిత్రానికి న్యాయం చేశారు. అందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చారు. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించారు. మా దర్శకుడు పవన్‌కు ఓ క్లారిటీ, విజన్ ఉంది. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.' అని అన్నారు.
యాక్షన్ మూవీస్ ఇష్టం
తనను ఓ మంచి నటిగా ఆడియన్స్ గుర్తు పెట్టుకోవాలని.. అందుకు తగ్గట్లుగానే మంచి రోల్స్, స్టోరీస్ ఎంచుకుంటూ వస్తున్నానని ఆకాంక్ష సింగ్ తెలిపారు. 'అన్ని రకాల పాత్రలను, జానర్లను టచ్ చేయాలని ఉంది. నాకు యాక్షన్ చిత్రాలంటే ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాను. తమిళంలో ఇంకో సినిమా చేస్తాను. నాని మూవీస్ అంటే చాలా ఇష్టం.' అని తెలిపారు.
'షష్టిపూర్తి' మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తుండగా.. MAA AAI ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపేష్ చౌదరి నిర్మిస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్‌తో పాటు అర్చన.. కాంతారా' ఫేమ అచ్యుత్ కుమార్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, మురళీధర్ గౌడ్, చలాకి చంటి, బలగం సంజయ్, మహిరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.