బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఘటన కొంత కాలం క్రితం సంచలనం సృష్టించింది. ఈ కేసు మరోసారి తెర మీదరకు వచ్చింది. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేసిన మాజీ యాంటీ డ్రగ్ అధికారి సమీర్ వాంఖడేపై, సీబీఐ అధికారులు అవినీతి కేసు నమోదు చేశారు. చాలా కాలంగా ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ  నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక బృందంతో విచారణ జరుపుతోంది. తాజాగా ఆయన అవినీతికి పాల్పడినట్లు నిర్దారణకు వచ్చిన అత్యుతన్నత దర్యాప్తు సంస్థ, సమీర్ వాంఖేడ్ పై కేసు ఫైల్ చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7A, 12,  ఐపీసీలోని సెక్షన్లు 120B, 388 కింద కేసు పెట్టారు.  సమీర్ తో పాటు మరో ఇద్దరు అధికారుల మీద కూడా కేసు ఫైల్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ, ముంబై, రాంచీ, లక్నో, గువహటి, చెన్నై సహా 30 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.


షారుఖ్ నుంచి రూ. 25 కోట్లు లంచం డిమాండ్


సీబీఐ ప్రాథమిక విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులు ఆర్యన్ ఖాన్ అరెస్టు కాగానే, విషయం షారుఖ్ ఖాన్ కు చెప్పి సమీర్ రూ. 25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇవ్వకపోతే ఆర్యన్ ఖాన్ ను ఈ కేసు నుంచి బయటకు రాకుండా చేస్తామని ఆయన హెచ్చరించినట్లు సీబీఐ నివేదికలో వెల్లడించింది. అంతేకాదు, ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు అతడి మిత్రుడు అర్బాజ్ మర్చంట్  పేర్లను చివరిలో యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ముడుపులు తీసుకుని కీలక నిందితులను వదిలి పెట్టినట్లు సీబీఐ తాజా నివేదిక వెల్లడించింది.     


విదేశీ ప్రయాణాలు, విలువైన ఆస్తులు


ఇక సమీర్ అవినీతి బాగోతం మీద పూర్తి స్థాయిలో సీబీఐ విచారణ జరుపుతోంది. గత ఐదు సంవత్సరాల్లో ఆయన తన ఫ్యామిలీతో కలిసి  పలు దేశాలకు వెకేషన్ కు వెళ్లినట్లు గుర్తించింది. సౌత్ ఆఫ్రియా, లండన్, ఐర్లాండ్, పోర్చుగల్, మాల్దీవ్స్ ట్రిప్స్ కు వెళ్లారని తెలిపింది. సుమారు 55 రోజులు పాటు ఆయా దేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు గుర్తించారు. అయితే, ఈ మొత్తానికి అయిన ఖర్చు కేవలం 8.75 లక్షలు మాత్రమే అన్నట్లు లెక్కలు చూపించినట్లు సీబీఐ గుర్తించింది. ఆయన చెప్పిన డబ్బు విమాన ప్రయాణ ఖర్చుకే అవుతుందని నివేదికలో వెల్లడించారు. అంతేకాదు, ఆయన దగ్గరున్న ఖరీదైన రోలెక్స్ వాచ్‌, ముంబైలో 4 ఫ్లాట్లు, వాషిమ్‌లో సుమారు 417 ఎకరాల భూములకు సంబంధించి సరైన ఆధారాలు లేవని సీబీఐ తేల్చింది. త్వరలోనే సమీర్ కు సంబంధించి పూర్తి అవినీతి వివరాలకు బయటకు రానున్నాయి.  


2021 అక్టోబర్‌లో ఆర్యన్ ఖాన్ సహా అతడి మిత్రులు కొర్డెలియా క్రూజ్‌లో రైడ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు డ్రగ్స్ తీసుకున్నారు. సమాచారం అందుకున్న NCB అధికారులు ఆర్యన్ ఖాన్ సహా ఇతరులను అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో ఆర్యన్ ఖాన్ 22 రోజులు జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆర్యన్ ఖాన్ బయటకు వచ్చాడు.


Read Also: భారతీయ సినీ పరిశ్రమలో టాలీవుడ్ టాప్, గోల్డెన్ గ్లోబ్ సంపాదకీయంలో ప్రశంసలు