ప్రముఖ తమిళ హీరో చియాన్ విక్రమ్ తన 62వ సినిమాను ప్రకటించారు. ఇటీవలే విడుదల అయి మంచి పేరు తెచ్చుకున్న ‘చిన్నా’ సినిమా డైరెక్టర్ ఎస్‌యూ అరుణ్ కుమార్‌తో చియాన్ విక్రమ్ తన కొత్త సినిమాను చేయనున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటుల గురించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో ముందుగా ‘ఛాప్టర్ 1: పోలీస్ స్టేషన్’ అని చూపించారు. ఒక పెళ్లయిన మహిళ, తన బిడ్డతో పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ స్టేషన్‌లో ఉన్న వారు రైటర్‌ను వెతుకుతూ ఉంటారు. ఆ మహిళ కొందరు తనను పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేయలేకబోయారని, తాను తప్పించుకుని వచ్చానని, వారు తన వెంటబడుతున్నారని ఏడుస్తూ చెబుతుంది. అనంతరం వారిని కొట్టుకుంటూ చియాన్ విక్రమ్ పోలీస్ స్టేషన్‌లోకి వచ్చాడు. పోలీసులను కూడా కొడతాడు. అడ్డుకోబోయిన పోలీసుకు చెవిలో ఏదో చెప్తాడు. అంతే ఆ పోలీసు ఒక్కసారిగా భయపడగా ఆగిపోతారు. ఆ తర్వాత ఎస్సై బయటకి వచ్చి ఎవరు నువ్వు? అని అడిగినప్పుడు తన అడ్రస్ పూర్తిగా చెప్పి వెళ్లిపోతాడు.
రానున్న మూడు నెలల్లో చియాన్ విక్రమ్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. నవంబర్ 24వ తేదీన గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ‘ధృవ నక్షత్రం’ విడుదల కానుంది. నిజానికి ఇది ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా ఆలస్యం అయింది. చివరికి గౌతం మీనన్ స్వయంగా చొరవ తీసుకుని దీన్ని థియేటర్లలోకి తీసుకువస్తున్నాడు.
ఇక 2024 జనవరిలో తమిళనాట ఎంతో హైప్ ఉన్న మోస్ట్ అవైటెడ్ ‘తంగలాన్’ విడుదల కానుంది. 2024 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా ‘తంగలాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ పా. రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యంత హై బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీయఫ్) నేపథ్యంలో జరిగిన నిజజీవిత గాథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial